తెలంగాణ బిజెపి అధ్యక్ష మార్పుపై ప్రచారం... క్లారిటీ ఇచ్చిన ఈటల రాజేందర్

By Arun Kumar PFirst Published May 24, 2023, 5:01 PM IST
Highlights

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ను తొలగించి కొత్తవారిని నియమిస్తారంటూ జరుగుతున్న ప్రచాారంపై ఈటల రాజేందర్ స్పందించారు. 

హైదరాబాద్ : తెలంగాణ బిజెపిలో అంతర్గత కుమ్ములాటలు సాగుతున్నాయంటూ ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ మంత్రి ఈటల రాజేందర్ మధ్య కోల్డ్ వార్ సాగుతోందని... దీనివల్ల పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సీనియర్లంతా ఈటల వర్గంలో వుండి బండి సంజయ్ ను రాష్ట్రాధ్యక్ష పదవినుండి తొలగించాలని అధిష్టానాన్ని కోరుతున్నట్లుగా వార్తలు వెలువడ్డాయి. ఈ క్రమంలో తాజాగా ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేసారు. 

తెలంగాణ బిజెపి అధ్యక్ష పదవినే కాదు ఏ పదవినీ తాను ఆశించడం లేదని ఈటల స్పష్టం చేసారు. కేవలం పదవుల కోసమే బిజెపిలో చేరలేదని అన్నారు. ఏ పదవి లేకున్నా పార్టీ బలోపేతానికి కృషిచేస్తానని... పదవుల కోసం ఆశించేరకం కాదన్నారు. తనకు ఏ బాధ్యతలు అప్పగించాలనేది జాతీయ నాయకత్వానికి బాగా తెలుసన్నారు. తనకు ఈ పదవి కావాలని నోరు తెరిచి అడిగే నాయకున్ని తాను కాదన్నారు ఈటల. 

Read More  బీఆర్ఎస్ కు షాక్.. భారత ఎన్నికల సంఘం విడుదల చేసిన జాబితాలో మళ్లీ కారును పోలిన గుర్తులు..

ఇక తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయ్ కొనసాగుతారని... ఎలాంటి మార్పు వుండకపోవచ్చని ఈటల స్ఫష్టం చేసారు. తెలంగాణలో బిజెపిని బలోపేతం చేసేందుకు సంజయ్ శక్తిమేరకు పనిచేస్తున్నారని అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారమని అన్నారు. ఎన్నికలను సమర్ధవంతంగా ఎదుర్కోవాలంటూ తమ శక్తిని ఇంకా పెంచుకోవాల్సిన అవసరం వుందన్నారు. తెలంగాణలో బిజెపి మరింత బలపడాలని డిల్లీ నాయకత్వం భావిస్తోందని... రాష్ట్ర నాయకుల అభిప్రాయం  కూడా అదేనని అన్నారు. 

ఇతర పార్టీల నుండి సీనియర్ నాయకులు బిజెపిలో చేరాలని కోరుతున్నామని... తద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా జాగ్రత్త పడుతున్నామని ఈటల అన్నారు. ఎన్నికల్లో గెలవాలంటే బలమైన నాయకత్వమే కాదు క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలాన్ని కూడా పెంచుకోవాల్సిన అవసరం వుందన్నారు. కాబట్టి పార్టీ బలోపేతం కోసం అందరి భాగస్వామ్యం అవసరమని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. 

 

click me!