దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం: హరీష్ రావుకు విజయశాంతి కితాబు

By telugu teamFirst Published Nov 11, 2020, 9:03 AM IST
Highlights

తెలంగాణ మంత్రి హరీష్ రావుపై సినీ నటి, కాంగ్రెసు నేత విజయశాంతి ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. హరీష్ రావు లేకుంటే దుబ్బాకలో టీఆర్ఎస్ కు డిపాజిట్ కూడా దక్కేది కాదని ఆమె అన్నారు.

హైదరాబాద్: దుబ్బాక శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నిక ఫలితంపై కాంగ్రెసు చైర్ పర్సన్, సినీ నటి విజయశాంతి ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. తెలంగాణ మంత్రి హరీష్ రావుకు ఆయన కొంత క్రెడిట్ ఇచ్చారు. హరీష్ రావు లేకుంటే దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు డిపాజిట్ కూడా దక్కేది కాదని ఆమె వ్యాఖ్యానించారు. 

టీఆర్ఎస్ అహంకార ధోరణికి, కేసీఆర్ దొర నిరంకుశ పోకడలకు సమాధానం దుబ్బాక తీర్పు అని ఆమె మంగళవారంనాడు అన్నారు. అధికార పార్టీ ప్రలోభాలకు లొంగిపోకుండా పాలకులపై ఓటు ద్వారా ప్రజలు వెల్లడించారని ఆమె అన్నారు. లక్ష మెజారిటీ ఖాయమని అన్న టీఆర్ఎస్ నేతలు ఆ తర్వాత ఒక్క ఓటుతో గెలిచినా గెలుపేనని అన్నారని ఆమె అన్నారు.

రోజుల వ్యవధిలోనే ఎందుకు దిగజారుతారో సమీక్షించుకోవాలని ఆమె టీఆర్ఎస్ నేతలకు సూచించారు. దొరల పాలనకు వ్యతిరేకంగా మరో ఉద్యమానికి దుబ్బాక ప్రజలు నాంది పలికారని ఆమె అన్నారు. 

దుబ్బాక ఫలితంలో కేసీఆర్ కు కనువిప్పు కలిగి ప్రచార, ప్రకటనల ఆర్భాటాలు కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తారని ఆశిస్తున్నట్లు కాంగ్రెసు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. దుబ్బాకలో కాంగ్రెసు ఆశించిన ఫలితం సాధించలేకపోయినా కేసీఆర్ అంతానికి ఈ ఫలితం నాంది అని ఆయన అన్నారు. 

ఇదిలావుంటే, కాంగ్రెసు ప్రచార కమిటీ చైర్ పర్సన్, సినీ నటి విజయశాంతి బిజెపిలో చేరడం ఖాయమైంది. ఆమె వచ్చే వారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఆ సమయంలో ఆమె బిజెపిలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. తద్వారా ఆమె సొంత గూటికి చేరుకుంటారు. బిజెపి ద్వారానే ఆమె తన రాజకీయ ఆరంగేట్రం చేశారు. 

ఢిల్లీలో విజయశాంతి పార్టీ పెద్దలతో సమావేశం కానున్నారు. పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆమె బిజెపిలో చేరే అవకాశం ఉంది. కాంగ్రెసుకు రాష్ట్రంలో భవిష్యత్తు లేదనే భావనకు వచ్చిన తర్వాత ఆమె బిజెపిలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

చాలా కాలంగా ఆమె కాంగ్రెసు పార్టీకి దూరంగానే ఉంటున్నారు. ప్రచార కమీటీకి సారథ్యం వహిస్తున్నప్పటికీ ఆమె దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రచారానికి వెళ్లలేదు. పైగా, ఆత్మప్రబోధానుసారం ఓటు వేయాలని ఆమె దుబ్బాక ఓటర్లకు పిలుపునిచ్చారు. దాంతోనే ఆమె కాంగ్రెసు నుంచి తప్పుకుంటారనే భావన బలపడింది.

click me!