దుబ్బాక ఉప ఎన్నిక: రూ.40 లక్షల రఘునందన్ రావు నగదు పట్టివేత

By telugu teamFirst Published Oct 6, 2020, 5:59 PM IST
Highlights

బిజెపి దుబ్బాక అభ్యర్థి రఘునందన్ రావుగా భావిస్తున్న రూ.40 లక్షలను షామీర్ పేట ఔటర్ రింగ్ రోడ్డుపై పట్టుకున్నారు. దుబ్బాకకు తరలిస్తుండగా ఆ నగదును స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ పద్మజ చెప్పారు

బాలానగర్: దుబ్బాక శాసనసభా నియోజకవర్గం ఉప ఎన్నిక నేపథ్యంలో పోలీసుుల రూ.40 లక్షలను పట్టుకున్నారు. బిజెపి దుబ్బాక అభ్యర్థి రఘునందన్ రావుకు అందించడానికి తరలిస్తుండగా వాటిని పట్టుకున్నట్లు బాలానగర్ డీసీపీ పద్మజ మీడియా ప్రతినిధులకు చెప్పారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా నగదును తరలిస్తున్నట్లు ఆమె తెలిపారు. 

శామీర్ పేట ఔటర్ రింగు రోడ్డు వద్ద సోమవారం రాత్రి 40 లక్షల రూపాయలను పట్టుకున్నట్లు, ఇందుకు సంబంధించి నలుగురిపై కేసులు నమోదు చేసినట్లు ఆమె తెలిపారు. డబ్బులు తరలిస్తున్న వ్యక్తులతో రఘునందన్ రావు పీఎం మాట్లాడిన విషయాన్ని గమనించామని, అందుకు సంబంధించిన ఆడియో సంభాషణను సేకరించామని ఆమె చెప్పారు. రఘూునందన్ రావును విచారిస్తామని ఆమె చెప్పారు.

తాము రఘునందన్ రావును సంప్రదించే ప్రయత్నం చేసినట్లు తెలిపారు. డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఎక్కడికి తరలిస్తున్నారు అనే విషయాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. దుబ్బాక ఓటర్లకు పంచడానికి ఆ డబ్బులు తరలిస్తున్నట్లు వారు భావిస్తున్నారు.  

టీఆర్ఎస్ శాసనసభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి మరణించడంతో దుబ్బాక శాసనసభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. టీఆర్ఎస్ తరఫున సోలిపేట రామలింగా రెడ్డి సతీమణి సోలిపేట సుజాత పోటీ చేస్తున్నారు. కాంగ్రెసు తరఫన మాజీ మంత్రి ముత్యంరెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాస రెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది. 

టీఆర్ఎస్ నాయకత్వం తనకు దుబ్బాక టికెట్ ఇవ్వకపోవడంతో చెరుకు శ్రీనివాస రెడ్డి మంగళవారం కాంగ్రెసు పార్టీలో చేరారు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెసు కండువా కప్పుకున్నారు. 

click me!