డిఎస్ ఇష్యూ: కేసీఆర్ వేచి చూసే ధోరణి, ఎందుకు?

First Published Jul 7, 2018, 2:17 PM IST
Highlights

డిఎస్ పై కవితతో సహా నిజామాబాద్ టీఆర్ఎస్ నేతలు తీవ్రమైన విమర్శలు చేస్తూ ఫిర్యాదు చేసినప్పటికీ కేసీఆర్ ఏ విధమైన చర్యలు తీసుకోవడం లేదు. డిఎస్ విషయంలో కేసీఆర్ వ్యూహం ఏమిటనేది ఆసక్తికరంగా మారింది.

హైదరాబాద్: పార్టీ రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారు. డిఎస్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిన నిజామాబాద్ టీఆర్ఎస్ నాయకుల్లో ఆయన కూతురు కల్వకుంట్ల కవిత కూడా ఉన్నారు.

స్వయంగా కూతురు ఫిర్యాదు చేసినప్పటికీ డిఎస్ పై చర్యలు తీసుకునే విషయంలో కేసిఆర్ ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారనేది ఆసక్తికరంగా మారింది. అయితే, డిఎస్ కు మాత్రం కెసిఆర్ అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. డిఎస్ ను కేసిఆర్ వేచి చూసే స్థితిలో పెట్టడం రాజకీయ వ్యూహంలో భాగమా అనే ప్రశ్న ఉదయిస్తోంది.

డిఎస్ కాంగ్రెసులోకి వెళ్తారనే ప్రచారం చాలా కాలంగా సాగుతోంది. ఆయన కుమారుడు అరవింద్ బిజెపిలో చేరడం డిఎస్ పై ప్రభావం పడినట్లు కనిపిస్తోంది. తాను బిజెపిలో చేరడాన్ని డిఎస్ కు అంటగడుతూ కల్వకుంట్ల కవితతో సహా ఇతర నేతలు తప్పు పట్టడంపై అరవింద్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. 

అయితే, డిఎస్ కు కేసిఆర్ తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదనే అభిప్రాయం చాలా కాలంగా ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో బహుశా కేసీఆర్ ఆయనను పట్టించుకోవడం కూడా మానేయవచ్చు. డిఎస్ తనంత తానుగా పార్టీ నుంచి వెళ్లిపోయే విధంగా చేస్తారా అనేది తెలియడం లేదు. పొమ్మన లేక పొగ పెట్టారనే అభిప్రాయం మాత్రం బలంగానే ఉంది. 

డిఎస్ పై చర్యలు తీసుకుంటే ఎదురయ్యే పరిణామాలపై కూడా కేసిఆర్ దృష్టి పెట్టారా అనేది తేలాల్సి ఉంది. తనపై చర్యలు తీసుకుంటే డిఎస్ టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా బలంగానే గొంతు విప్పవచ్చు. ఆ స్థితిలో ఆయనను ఎదుర్కోవడానికి తగిన ప్రతివ్యూహాన్ని రచించాల్సి ఉంటుంది. డిఎస్ తనంత తానుగా వెళ్లిపోతే దాని తీవ్రత తక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. అందుకే కేసిఆర్ వేచి చూస్తుండవచ్చునని అంటున్నారు. 

click me!