ఒంటరి మహిళతో తాగుబోతు యువకుల వెకిలిచేష్టలు... కాపాడిన బస్సు డ్రైవర్

By Arun Kumar PFirst Published May 22, 2023, 11:45 AM IST
Highlights

మిర్యాలగూడ నుండి హైదరాబాద్ వెళుతున్న ఆర్టిసి బస్సులో ఇద్దరు తాగుబోతులు ఓ ప్రయాణికురాలి వేధించి కటకటాలపాలయ్యారు. 

మిర్యాలగూడ : మహిళ ఒంటరిగా కనిపించిందంటే చాలు ఆకతాయిలు వెకిలిచేష్టలకు పాల్పడుతుంటారు. అందరూ చూస్తుండగానే రోడ్డుపై వెళ్లే అమ్మాయిలను వేధించే ఆకతాయిలు అర్థరాత్రి మద్యంమత్తులో వుండగా అమ్మాయి ఒంటరిగా కనిపించిందంటే ఊరికే వుంటారా... వెకిలిచేష్టలతో వేధించారు. అయితే యువతి కూడా వారిని ధైర్యంగా ఎదిరించి బస్సు డ్రైవర్ సాయంతో పోలీసులకు అప్పగించింది. ఈ ఘటన నల్గొండ జిల్లాలో వెలుగుచూసింది.

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఈవెంట్ ఆర్గనైజర్ గా పనిచేసే ఓ మహిళ ఇటీవల హైదరాబాద్ నుండి మిర్యాలగూడకు వెళ్ళింది. ఈ నెల 20న ఈవెంట్ పూర్తిచేసుకుని అర్ధరాత్రి ఆర్టిసి బస్సులో హైదరాబాద్ కు తిరుగుపయనం అయ్యింది. మిర్యాలగూడ బస్టాండ్ నుండి అర్థరాత్రి 12 గంటల సమయంలో మహిళతో పాటు మరో నలుగురు ప్రయాణికులతో బస్సు హైదరాబాద్ కు బయలుదేరింది. 

అయితే మద్యంమత్తులో బస్సెక్కిన మంగళ్ సింగ్, కిరణ్ లు ఒంటరిగా మహిళ కనిపించడంతో అసభ్యంగా ప్రవర్తించారు. మహిళ పక్కసీట్లో కూర్చుని కామెంట్స్ చేయడం, ఆమె కూర్చున్న సీటుపై కాలుపెట్టి అసభ్యంగా ప్రవర్తించారు. ఈ వేధింపులు తాళలేక ఆమె ముందుకు వెళ్లి డ్రైవర్ క్యాబిన్ దగ్గరు కూర్చుంది. అక్కడికి కూడా వచ్చిన తాగుబోతులు మహిళను వేధిస్తుండగా డ్రైవర్ వారిని అడ్డుకునే ప్రయత్నం చేసాడు. దీంతో అతడిపై ఇద్దరు ఆకతాయిలు దాడికి పాల్పడ్డారు. దీంతో డ్రైవర్ బస్సును నేరుగా నల్గొండ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాడు. మహిళ ఫిర్యాదుతో వేధింపులకు దిగిన ఇద్దరు తాగుబోతు యువకులను పోలీసులు అరెస్ట్ చేసారు. 

Read More  అన్నమయ్య జిల్లా : బాలికపై అత్యాచారయత్నం, యువకుడిని కొట్టి చంపిన మైనర్ బంధువులు

ఒంటరి మహిళపై వేధింపులకు దిగడంతో పాటు డ్రైవర్ పై దాడిచేసిన కిరణ్, మంగళ్ సింగ్ పై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసారు. వారిని న్యాయస్థానంలో హాజరుపర్చి కటకటాల్లోకి నెట్టారు. ఆకతాయిల నుండి తనను కాపాడిన బస్సు డ్రైవర్ సైదులుకు మహిళ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు మిర్యాలగూడ ఆర్టిసి డిపో మేనేజర్ కు మహిళ ఆదివారం ఓ కృతజ్ఞత లేఖ పంపించారు. 
 

click me!