రాష్ట్రంలో వందశాతం ఇళ్లకు తాగునీరు.. ఓడీఎఫ్ ప్లస్ లో తెలంగాణ టాప్.. కేంద్ర జలశక్తిశాఖ వెల్లడి...

By Bukka SumabalaFirst Published Aug 20, 2022, 8:39 AM IST
Highlights

వందశాతం ఇళ్లకు తాగునీరు అదించే తొలి మూడు రాష్ట్రాల్లో తెలంగాణ స్థానం దక్కించుకుంది. ఈ మేరకు కేంద్ర జల్ శక్తి శాఖ వెల్లడించింది. ఓడీఎఫ్ ప్లస్ ర్యాంకింగ్ లో తెలంగాణ టాప్ గా నిలిచింది. 

ఢిల్లీ : బహిరంగ మలవిసర్జనను పూర్తిగా పరిహరించడంతో పాటు ఘన, ద్రవ పదార్థాలను సక్రమంగా నిర్వహిస్తూ ఓడిఎఫ్ (ఓపెన్ డెఫకేషన్ ఫ్రీ)  ప్లస్ సాయి పొందిన టాప్ ఐదు రాష్ట్రాల్లో తెలంగాణ, తమిళనాడు, ఒడిషా, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ లు ఉన్నట్లు కేంద్ర జలశక్తి శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు దేశంలోని 1,01,462 గ్రామాలు ఓడీఎఫ్ ప్లస్ స్థాయిని పొందగా, అందులో అత్యధిక గ్రామాలు ఈ ఐదు రాష్ట్రాల్లో ఉన్నట్లు తెలిసింది. సాంకేతికంగా ఘన, ద్రవ వ్యర్ధాల నిర్వహణలో ఉన్న సవాళ్లను దృష్టిలో ఉంచుకుంటే లక్ష గ్రామాలు ఈ స్థాయిని పొందడం సాధారణ విషయం కాదని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా మెరుగుపడిన తరువాత... మురుగునీరు ఎక్కువ ఉత్పత్తి అవుతోందని, దాన్ని శుద్ధి చేసి మళ్ళీ వినియోగించుకోవాల్సి వస్తోందని వివరించింది.

అలాగే జీవనశైలిలో వచ్చిన మార్పుల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్యాకేజ్డ్ ఆహార ఉత్పత్తుల వినియోగం పెరిగి పోయిందని దాంతో ప్లాస్టిక్ సమస్యనూ పరిష్కరించాల్సి ఉందని పేర్కొంది. ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ అన్నది గ్రామీణ ప్రాంతాలకు కొత్త కాబట్టి రాష్ట్రాలకు నిధుల పరంగా, సాంకేతికంగా అన్ని విధాలా కేంద్రం సహకరిస్తున్నట్లు పేర్కొంది. 2024-25 నాటికల్లా సంపూర్ణ స్వచ్ఛభారత్ సాధించి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కేంద్రం కట్టుబడి ఉన్నట్లు వెల్లడించింది.

ప్రతీ పౌరుడి వెన్నులో వణుకు పుడుతోంది.. సీజేఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ

గ్రామీణ ప్రాంతాల్లో వంద శాతం ఇళ్లకు తాగునీరు అందించే టాప్ త్రీ రాష్ట్రాల్లోనూ తెలంగాణ నిలిచినట్లు కేంద్ర జలశక్తి శాఖ పేర్కొంది. రాష్ట్రాల పరంగా చూస్తే… గోవా, తెలంగాణ, హర్యానా, కేంద్రపాలిత ప్రాంతాల్లో..  పుదుచ్చేరి, దాద్రా నగర్ హవేలీ, డయ్యు డామన్,  అండమాన్ నికోబార్ దీవులు వంద శాతం ఇళ్లకు నల్లా నీరు అందిస్తున్నట్లు వెల్లడించింది. దేశ వ్యాప్తంగా 117 ఆకాంక్షిత (వెనుకబడిన)జిల్లాల్లో తెలంగాణలోని  కుమురంభీం ఆసిఫాబాద్,  జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, పంజాబ్ లోని మోగా, హర్యానాలోని మేవాట్, హిమాచల్ ప్రదేశ్ లోని చంబా జిల్లాలు వంద శాతం గ్రామీణ కుటుంబాలకు నల్లా నీరు అందిస్తున్నట్లు వెల్లడించింది.

click me!