రూ. 750 కోట్ల గోల్డ్ ఫ్రాడ్: కీలక నిందితుడు నాగసిద్ధు సునీల్ అరెస్టు

By telugu teamFirst Published Feb 20, 2020, 10:42 AM IST
Highlights

రూ.750 కోట్ల విలువ చేసే దిగుమతి బంగారం ఫ్రాడ్ కేసులో డీఆర్ఐ కీలక నిందితుడు నాగసిద్ధు సునీల్ ను అరెస్టు చేసింది. 9 నెలలుగా తప్పించుకు తిరుగుతున్న నాగసిద్ధు సునీల్ ను తమిళనాడులో అరెస్టు చేసింది.

హైదరాబాద్: రూ.750 కోట్ల దిగుమతి బంగారం ఫ్రాడ్ కేసులో రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ (డీఆర్ఎఐ) కీలక నిందితుడిని తమిళనాడులో అరెస్టు చేసింది. గత 9 నెలలుగా పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న నాగసిద్ధు సునీల్ ను తమిళనాడులోని పవూర్చత్రం పట్టణంలో సోమవారం అరెస్టు చేసి ట్రాన్సిట్ వారంట్ పై హైదరాబాదుకు తరలించారు. 

సునీల్ ను బుధవారం నాంపల్లి క్రిమినల్ కోర్టులో ప్రవేశపెట్టారు. అతనికి కోర్డు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. శంషాబాద్ సమీపంలోని రావిర్యాల జెమ్స్ సెజ్ యూనిట్ శ్రీకృష్ణ ఎగ్జిమ్ ఎల్ఎల్పీ కోసం అతను పనిచేస్తున్నాడు. విదేశీ బంగారం దిగుమతిని దారి మళ్లించినట్లు, ఎగుమతులపై తప్పుడు డిక్లరేషన్ ఇచ్చినట్లు అతనిపై ఆరోపణలున్నాయి.

రూ. 750 కోట్ల విలువ చేసే దాదాపు 1,800 కిలోల దిగుమతి సుంకం ఫ్రీ బంగారాన్ని తెప్పించుకుని దాన్ని దారి మళ్లించి శ్రీకృష్ణ స్థానిక మార్కెట్లో విక్రయించినట్లు చెబుతున్నారు. సునీల్ గత 9 నెలలుగా కర్ణాటక, తమిళనాడు, పూణేల్లో సంచరిస్తూ అరెస్టు నుంచి తప్పించుకుంటున్నాడని డీఆర్ఎస్ తన రిమాండ్ రిపోర్టులో తెలిపింది.

పవూర్చత్రంలో సునీల్ తన భార్య, కుమారులతో కలిసి ఎవరికీ కనిపించకుండా ఉంటున్నాడు. అతన్ని అక్కడ అరెస్టు చేసి మంగళవారంనాడు తొలుత మదురై కోర్టులో ప్రవేశపెట్టారు. సునీల్ తొలుత కర్ణాటకలోని మన్నెర్హాల్ వెళ్లాడని, ఆ తర్వాత పూణే వెళ్లాడని చెబుతున్నారు 

బంగారం ఫ్రాడ్ కేసు దర్యాప్తును గత మూడేళ్లుగా డీఆర్ఎస్ సాగిస్తోంది. పలు చోట్ల సోదాలు కూడా నిర్వహించింది. ఈ సోదాల్లో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.

click me!