
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలపై భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు స్పందించారు. అసెంబ్లీలో ఆయన ఈ రోజు ప్రాజెక్టులపై మాట్లాడుతూ.. పాలమూరు ప్రాజెక్టులను అడ్డుకోవద్దని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణకు సభ సాక్షిగా విజ్జప్తి చేశారు.
అలాగే, కాంగ్రెస్ నేతలకు ఏదైనా కోపముంటే మమ్మల్ని, మా సీఎంను ఎన్నైనా తిట్టండిగానీ పాలమూరు ప్రజల నోట్లో మట్టి కొట్టకండని కోరారు. పాలమూరు ప్రాజెక్టులను కోర్టు కేసులతో అడ్డుకోవద్దని డీకే అరుణకు రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు.
అయితే హరీష్ ప్రసంగాని కంటే ముందు డీకే అరుణ ప్రాజెక్టుల విషయం మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలోనే భారీ ప్రాజెక్టులు నిర్మించామని ఇప్పుడు ఆ క్రెడిట్ ను టీఆర్ఎస్ సర్కారు తన అకౌంట్లో వేసుకోడానికి ప్రయత్నిస్తొందని విమర్శించారు.
ఈ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి హరీశ్ రావు ప్రాజెక్టులను మధ్యలోనే వదిలేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని మిమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రా ప్రాజెక్టులపై పెట్టిన శ్రద్ధ తెలంగాణ ప్రాజెక్టులపై పెట్టి ఉంటే ఇప్పుడీ ఈ దుస్థితి వచ్చేదేకాదని విమర్శించారు.