
వూళ్లో నీళ్ల సమస్యో, డ్రెయినేజీ సమస్యో వస్తే ఏంచేస్తారు...
మునిసిపల్ అధికారులకు విన్నవిస్తారు. ఆపైన పురజనులంతా కలసి ధర్నానో , రాస్తరోకోనో చేస్తారు. అధికారుల నిర్లక్ష్యాన్ని ఎదుర్కొనేందుకు అదొక మార్గం. అయితే, గద్వాల పట్టణంలో వ్యవహారం తిరగబడింది. అక్కడి మునిసిపాలిటికి పన్ను కట్టని వాళ్లను ప్రసన్నంచేసుకునేందుకు మునిసిపల్ అధికారులు ధర్నాకు దిగారు. ఇది అధికారుల వినూత్న విధానమనుకోవాలా లేక బలమున్నోడి దగ్గిర చేతకాని తనం అనుకోవాల.
(ఏమయిన సరే, ఈ చర్య వల్ల ధర్నాకు ప్రభుత్వం గుర్తింపొచ్చింది. పోలీసుల పర్మిషన్ అవసరం లేకుండా ధర్నా చేయవచ్చు, నినాదాలు కూడ ఇవ్వొచ్చేమో ఇక ముందు)
జోగులాంబజిల్లా గద్వాల హెడ్ క్వార్టర్ లో మంగళవారం ఈ ఇదే జరిగింది.
గద్వాల పట్టణంలోని విశ్వేశ్వరయ్య మెమోరియల్ హైస్కూల్ పాఠశాలకు చెందిన యాజమాన్యం మున్సిపాలిటీకి చెల్లించాల్సిన ఆస్తిపన్ను చెల్లించలేదు. మొదట పాఠశాలకు నోటీసులు పంపించారు. అయినా యాజమాన్యం స్పందిచక లేదు. చివరకు, మున్సిపల్ కమిషనర్ సంధ్య 30 సిబ్బందితో వచ్చి ఆస్తి పన్ను చెల్లించాలని పాఠశాల ఎదుట ధర్నా చేపట్టారు. నినాదాలు చేశారు.
20 ఏళ్లుగా పాఠశాల యాజమాన్యం పన్ను చెల్లించలేదు. ఎంత ధైర్యం. బకాయి, జరిమానాతో కలసి రూ. 11 లక్షలకు చేరుకుంది. మునిసిపాలిటీ అధికారులను, నోటీసులను యాజమాన్యం లెక్కే చేయలేదు. ధర్నా తర్వాత ఏం జరిగింది. యాజమాన్యం కొంత గడువు ఇవ్వాలని ఫోన్ చేసి కోరింది. అధికారులు అంగీకరించారు. ధర్నా విరమించారు.
తర్వాత ఎవిఎం డిగ్రీ కళాశాలకు వెళ్లి అక్కడ రు.2.50 లక్షల కోసం ధర్నా చేశారు.కొద్దిసేపు అయ్యాక యజమాని దగ్గిర నుంచి కమిషనర్ కు ఫో న్ వచ్చింది. ఆయన కొంత గడువు అడిగారు. మేడమ్ అంగీకరించారు. ధర్నా విరమించారు. యజమానులెవరూ పరిగెత్తుకుంటూ కమిషనర్ దగ్గిర కొచ్చి కాళ్లా వేళ్లా పడటం కాదు, కనీసం హాజరు కూడా వేసుకోలేదు.
ప్రభుత్వం చుట్టూపోలీసులున్నారు. చట్టాలున్నాయి. కోర్టులున్నాయి. డబ్బువసూలు చేసే ఇతర ఎన్నో పద్ధతులున్నాయి. వాటిని ప్రయోగించకుండా, మునిషిపల్ కమిషనర్ ఇలా ధర్నాకు దిగడం ఏమిటో? ఇదే కమిషనర్, అదే వూర్లో చిన్న చిన్న దుకాణ దారులకు రెడ్ నోటీసులిచ్చి దుకాణాలకు తాళాలేసుకుపోయారు. మరి ఈ అధికారం బలవంతుల దగ్గిర పనిచేయలేదా...