
హైదరాబాద్: సీనియర్ అడ్వకేట్ బీ బాలాముకుంద రావుకు తెలంగాణ హైకోర్టు గట్టి వార్నింగ్ ఇచ్చింది. కోర్టులో మళ్లీ సల్మాన్ ఖాన్‌లా బిహేవ్ చేయవద్దని హితవు పలికింది. కోర్టులో సల్మాన్ ఖాన్ తరహా యాక్టివిటీలకు అవకాశం లేదని స్పష్టం చేసింది. అదే విధంగా బార్ అండ్ బెంచ్ ఒకే కుటుంబం వంటిదని, ఉభయులూ పరస్పరం గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని తెలిపింది.
సింగిల్ బంచ్ జడ్జీ పీ మాధవి దేవిపై గతేడాది డిసెంబర్ 15న న్యాయవాది బీ బాలముకుంద రావు అభ్యంతరకరంగా వ్యవహరించారు. కోర్టు ప్రొసీడింగ్స్‌ను అడ్డుకోవడమే కాదు.. న్యాయమూర్తిపైనే ఆరోపణలకు దిగారు. ఆమె తన చర్య ల ద్వారా ఓపెన్ కోర్టులో తనను అగౌరవపరిచారని, ఆమె ప్రవర్తన కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని న్యాయమూర్తికే నోటీసు పంపి వివరణ కోరారు. ఈ వ్యవహారం సంచలనంగా మారింది. సదరు న్యాయవాది బాలముకుంద రావు ప్రవర్తనపై హైకోర్టు సీరియస్ అయింది.
హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ సారథ్యంలో జస్టిస్ ఎన్ తుకారాంజీ ద్విసభ్య ధర్మాసనం అడ్వకేట్ బాలముకుంద రావు పై సుమోటు కోర్టు ధిక్కరణ విచారణ చేపట్టింది. శుక్రవారం ఈ విచారణ చేపట్టగా అడ్వకేట్ బాలముకుంద రావు క్షమాపణలు చెప్పారు.మరోసారి ఇలాంటి తీరు రిపీట్ కాదని తెలిపారు.
2022 డిసెంబర్ 15న సింగిల్ బెంచ్ జడ్జీ పీ మాధవి దేవి ఓ కేసులో వాదనలు వింటున్న సమయంలో కోర్టు ప్రొసీడింగ్స్‌ను అడ్వకేట్ బీ బాలముకుంద రావు ఆటంకపరిచారు. ఆయన కేసును రిప్రజెంట్ చేస్తూ హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులను ఉటంకించారు. కానీ, ఆ జడ్జిమెంట్లను పరిశీలించడానికి న్యాయమూర్తి మాధవి దేవి నిరాకరించారు.
Also Read: హైకోర్టు సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్, కేఏ పాల్ చిత్ర పటాలకు కామారెడ్డి రైతుల పాలాభిషేకం..
వేరే కౌన్సెల్ సూచనల మేరకు తనను అనవసరమైన ప్రశ్నలు వేసి అవమానించారని న్యాయమూర్తి మాధవి దేవిపై ఆరోపణలు చేశారు. ఆమె ప్రవర్తన కోర్టు ధిక్కరణ యాక్ట్‌లోని సెక్షన్లు 11, 12ల కింద శిక్షార్హమని పేర్కొన్నారు. దీనిపై తనకు వారంలోగా వివరణ ఇవ్వాలని నోటీసులూ పంపాడు. ఒక వేళ వివరణ ఇవ్వకుంటే తాను చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ సారథ్యంలోని ద్విసభ్య ధర్మాసనానికి శుక్రవారం అడ్వకేట్ బాలముకుందరావు తన చర్యలకు బేషరతుగా క్షమాపణలు చెప్పారు. మరోసారి ఇలా ప్రవర్తించనని తెలిపారు. జస్టిస్ మాధవి దేవికి పంపిన నోటీసులను ఆయన ఉపసంహరించుకున్నారు. ఆ రోజు తాను వ్యవహరించిన తీరుకు తాజాగా క్షమాపణలు చెప్పారు. దీనికి చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ బాలముకుంద రావుకు వార్నింగ్ ఇచ్చారు. మళ్లీ ఇలాంటివి రిపీట్ కావద్దని హెచ్చరించారు. కోర్టులో మళ్లీ సల్మాన్ ఖాన్‌లా వ్యవహరించవద్దని అన్నారు. కోర్టులో సల్మాన్ ఖాన్ వంటి యాక్టివిటీలకు తావు లేదని స్పష్టం చేశారు. అంతేకాదు, బార్ అండ్ బెచ్ రెండూ ఒకే కుటుంబం వంటివని అన్నారు. మనం ఒకరినొకరం గౌరవించుకోవాలని వివరించారు. అడ్వకేట్ బాలముకుంద రావు క్షమాపణలను అంగీకరించి కేసును క్లోజ్ చేశారు.