ఆస్పత్రిలో మంత్రి మల్లారెడ్డి కొడుకు మహేందర్ రెడ్డికి చికిత్స.. ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఏం చెప్పారంటే..

By Sumanth KanukulaFirst Published Nov 23, 2022, 12:09 PM IST
Highlights

కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబసభ్యులు, సన్నిహితుల నివాసాలు, విద్యాసంస్థల్లో ఐటీ అధికారులు రెండో రోజు సోదాలు జరుపుతున్నారు. అయితే ఐటీ దాడుల వేళ మంత్రి మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను సూరారంలోని ఆస్పత్రిలో చేర్పించారు.

కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబసభ్యులు, సన్నిహితుల నివాసాలు, విద్యాసంస్థల్లో ఐటీ అధికారులు రెండో రోజు సోదాలు జరుపుతున్నారు. మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి, భద్రారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి, బంధువుల ఇళ్లలో, వారికి చెందిన ఇంజనీరింగ్, మెడికల్, ఫార్మసీ కాలేజ్‌ల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే ఐటీ దాడుల వేళ మంత్రి మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను సూరారంలోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చేర్పించారు. 

అయితే తాజాగా మహేందర్ రెడ్డి ఆరోగ్యంపై వైద్యులు వివరాలను వెల్లడించారు. మహేందర్ రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. ఎడమ భుజం, చెస్ట్ పెయిన్‌తో ఆస్పత్రికి వచ్చారని తెలిపారు. ఈసీజీలో కొద్దిగా తేడాలు ఉన్నాయని.. మానిటరింగ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. మహేందర్ రెడ్డి అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారు. ఒత్తిడి వల్ల సరైన నిద్ర లేకపోవడంతో ఇలా జరిగే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. 

మహేందర్ రెడ్డికి చికిత్స అందించిన డాక్టర్లలో ఆయన సోదరుడు భద్రారెడ్డి భార్య కూడా ఉన్నారు. ఆమె మాట్లాడుతూ.. గతంలో కూడా మహేందర్ రెడ్డికి ఈ సమస్య ఉండేదని చెప్పారు. అప్పుడు నిర్లక్ష్యం చేసి ఉంటారని.. ఇప్పుడు ఒత్తిడి ఎక్కువ కావడంతో పెయిన్ బయటకు వచ్చిందేమోనని  చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. ప్రస్తుతం మానిటరింగ్‌లో ఉన్నారని.. ఈ రోజు సాయంత్రం వరకు డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని తెలిపారు. 

ఇదిలా ఉంటే.. తన కుమారుడి ఆరోగ్య పరిస్థితిపై మంత్రి మల్లారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మహేందర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారనే  విషయం తెలిసిన వెంటనే మంత్రి మల్లారెడ్డి కుమారుడిని చూసేందుకు ఆస్పత్రికి వెళ్లారు. అయితే తన కుమారుడిని చూడనివ్వడం లేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కొడుకుని ఏమైనా  చేస్తారేమోనని భయంగా ఉందని చెప్పారు. తన కొడుకును కొట్టినట్టున్నారని ఆరోపించారు.  ఐటీ అధికారులు రాత్రంతా ఇబ్బంది పెట్టినట్టు ఉన్నారనే అనుమానం వ్యక్తం చేశారు. తాము ఎవరిని మోసం చేయడం లేదని అన్నారు. ఎంత మంది పేద విద్యార్థులకు తక్కువ ఖర్చులో విద్యను అదిస్తున్నామని తెలిపారు. బీజేపీ దుర్మార్గ పాలన చేస్తుందని మండిపడ్డారు. తమ కుటుంబం మానసిక ఒత్తిడికి గురవుతోందని చెప్పారు. మెడికల్ సీట్ల కేటాయింపుల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని చెప్పారు. మల్లారెడ్డి ఆస్పత్రికి వచ్చిన సమయంలో పెద్ద ఎత్తున టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా చేరుకున్నారు. 


ఇక, రెండో సారి కూడా మంత్రి మల్లారెడ్డి ఆస్పత్రికి వచ్చారు. ఆయనతో పాటు ఐటీ అధికారులు ఉన్నారు. అయితే ఈ సారి తన కొడుకును కలిశానని.. అతడు చాలా బాధపడుతున్నాడని మంత్రి మల్లారెడ్డి చెప్పారు. 

click me!