
యాసంగిలో రైతులు వరిసాగు చేయవద్దని తెలంగాణ ప్రభుత్వ (telangana cs) ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ (somesh kumar) మరోమారు స్పష్టం చేశారు. శనివారం కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలు, జిల్లా వ్యవసాయ, పౌరసరఫరాలశాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లు, యాసంగి సాగు, సంబంధిత అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. పారాబాయిల్డ్ బియ్యం తీసుకోరాదని కేంద్ర ప్రభుత్వం, ఎఫ్‌సీఐ (fci) నిర్ణయించాయని వెల్లడించారు. రాష్ట్రంలో యాసంగిలో సాగయ్యే వరి పారా బాయిల్డ్ బియ్యానికే అనుకూలమన్న ఆయన.. రైతులు యాసంగిలో వరి సాగు చేయవద్దని సూచించారు. విత్తన కంపెనీలు, మిల్లర్లతో ఒప్పందాలు చేసుకునే వారు సొంత రిస్క్‌తో వరిసాగు చేసుకోవచ్చని సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. వానాకాలం ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరిగేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్న సీఎస్.. అవసరమైన చోట కొత్త కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ALso Read:Paddy procurement in telangana: తెలంగాణలో యథావిధిగా ధాన్యం సేకరిస్తామన్న కేంద్రం..
కలెక్టర్లు, సీనియర్ అధికారులు కొనుగోలు కేంద్రాలను తరచూ సందర్శించి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం వస్తున్నట్టు కొన్ని ఘటనలు వెలుగు చూశాయని సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల ధాన్యం మన రాష్ట్రంలోకి ప్రవేశించకుండా కలెక్టర్లు, పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇలాంటి వాటి వల్ల రాష్ట్ర రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయని ఆయన తెలిపారు. వానాకాలంలో కేవలం 40లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తామని కేంద్రం తెలిపిందని .. ధాన్యాన్ని బియ్యంగా మార్చి పంపిస్తేనే కొనుగోళ్లకు సరిపడా స్థలం ఉంటుందని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.
కాగా... తెలంగాణలో ధాన్యం సేకరణకు (paddy procurement in telangana) సంబంధించి టీఆర్‌ఎస్, బీజేపీల మధ్య మాటల యుద్దం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇరు పార్టీలు పోటాపోటీగా ధర్నాలు కూడా చేపట్టాయి. కేంద్రందే తప్పని రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ ఆరోపిస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి సరిగా లేదని బీజేపీ మండిపడుతుంది. తాజాగా ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను (Piyush Goyal) తెలంగాణ మంత్రుల బృందం శుక్రవారం కలిసిన సంగతి తెలిసిందే. ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన నిరంజన్ రెడ్డి (niranjan reddy) .. ధాన్యం సేకరణకు సంబంధించి కేంద్రం తీరుపై మండిపడ్డారు. ఎంతో ఆశతో తాము ఢిల్లీ వచ్చామని.. కానీ తమకు నిరాశే ఎదురైందని అన్నారు. రాష్ట్రంలో యాసంగి సీజన్‌లో వరి పంటను వేయనివ్వవద్దని కేంద్ర మంత్రి గట్టిగా చెప్పారని అన్నారు.