తెలంగాణ బీజేపీలో అసమ్మతి సెగ.. బీజేపీ అధిష్టానానికి ఈటల ఏం చెప్పారు..?

By Asianet NewsFirst Published May 18, 2023, 12:47 PM IST
Highlights

తెలంగాణ బీజేపీలోని కొందరు ముఖ్య నేతల మధ్య సఖ్యత లేదనే సంగతి  తెలిసిందే. అయితే కర్ణాకటలో బీజేపీ ఓటమి తర్వాత తెలంగాణలో బండి సంజయ్ నాయకత్వంపై రాష్ట్ర బీజేపీ నాయకుల్లో అసంతృప్తి, అసమ్మతి వ్యాపిస్తున్నట్టుగా తెలుస్తోంది.

హైదరాబాద్: తెలంగాణ బీజేపీలోని కొందరు ముఖ్య నేతల మధ్య సఖ్యత లేదనే సంగతి  తెలిసిందే. అయితే కర్ణాకటలో బీజేపీ ఓటమి తర్వాత తెలంగాణలో బండి సంజయ్ నాయకత్వంపై రాష్ట్ర బీజేపీ నాయకుల్లో అసంతృప్తి, అసమ్మతి వ్యాపిస్తున్నట్టుగా తెలుస్తోంది. కొంతకాలంగా సంజయ్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న కొందరు నేతలు ఇప్పుడు బలంగా వారి వాయిస్‌ను వినిపించేందుకు సిద్దమవుతున్నారని  సమాచారం. ముఖ్యంగా రాష్ట్ర బీజేపీ పాతవారికి, కొత్తవారికి మధ్య సయోధ్య లేదనే ప్రచారం చాలా కాలంగా ఉన్న సంగతి  తెలిసిందే. హార్డ్ కోర్ హిందుత్వం‌తో బీజేపీలోని పాత నాయకులు.. త్వరితగతిన విజయం సాధించాలని, పార్టీలో వేగంగా  ఎదగాలని చూస్తున్న వృత్తిపరమైన రాజకీయ నాయకులను వ్యతిరేకిస్తున్నట్టుగా తెలుస్తోంది. 

అయితే ఈ విభేదాలు ప్రస్తుతం తారా స్థాయికి చేరుకున్నాయి. దీంతో ఈ అసమ్మతి బీజేపీ కేంద్ర నాయకత్వానికి తలనొప్పిగా మారినట్టుగా సమాచారం. అయితే బీజేపీలో బయటి నుంచి వచ్చిన వ్యక్తులు అగ్రస్థానాల్లోకి వచ్చే అవకాశం లేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అస్సాం ముఖ్యమంత్రి హేమంత బిస్వా శర్మ విషయానికి వస్తే.. ఆయనకు పార్టీలో చేరగానే అగ్రస్థానం లభించలేదని.. ఒక టర్మ్ వేచి చూశాకే ఆయనకు సీఎం పీఠం దక్కిందని గుర్తుచేస్తున్నారు. 

Latest Videos

ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఢిల్లీ టూర్ ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో అత్యవసరంగా పిలుపు రావడంతో ఆయన హుటాహుటిన ఢిల్లీ చేరుకున్నారు. ఈ సమావేశంలో అమిత్ షా వద్ద ఈటల రాజేందర్ పలు అంశాలను ప్రస్తావించినట్టుగా సమాచారం. తెలంగాణ బీజేపీ యూనిట్ అంతా సక్రమంగా జరగడం లేదని.. పార్టీ క్యాడర్ బలం పెరగడం లేదని.. అధికార బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ప్రజలను ఆకర్షించడంలో తగినంతగా  ముందుకు వెళ్లలేకపోతున్నామని ఈటల చెప్పినట్టుగా తెలుస్తోంది. 

హిందుత్వ అజెండాతో ప్రచారం దక్షిణ భారతదేశంలో అంతగా  వర్క్‌ అవుట్ కాదని ఈటల బీజేపీ అధిష్టానానికి తెలియజేసినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ పేరు మార్చడం, ముస్లిం కోటా, హిజాబ్ వంటివి కాకుండా.. లౌకికవాదం, సామరస్యం, సంక్షేమ హామీలు, బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలతో ముందుకు వెళితే బాగుంటుందని చెప్పినట్టుగా సమాచారం. తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించాలని ఈటల తన నివేదికలో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. 

ఇక, బీజేపీ కేంద్ర నాయకత్వం రాష్ట్రంలో పార్టీ విజయం సాధించాలని కోరుకుంటుండగా.. రాష్ట్ర నాయకత్వంలో మాత్రం విచిత్రమైన పరిస్థితి నెలకొంది. బయటి నుంచి వచ్చినవారికి, కొత్తవారికి కీలక బాధ్యతలు ఇచ్చేందుకు ఓ వర్గం అంగీకరించడం లేదని ఆ పార్టీ వర్గాల్లోనే చర్చ సాగుతుంది. ఈ పరిణామాల  నేపథ్యంలో బీజేపీలోకి వచ్చేందుకు ఇతర పార్టీల నేతలు ఆసక్తి చూపడం లేదని.. ఆ పార్టీకి చెందిన  కొందరు నాయకులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. మరి ఈ సమస్యలకు బీజేపీ అధిష్టానం ఏ విధంగా చెక్ పెడుతుందో వేచి చూడాల్సి ఉంది. 
 

click me!