
హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని యూత్ కాంగ్రెస్ వార్‌రూమ్‌పై సోమవారం పోలీసులు సోదాలు చేయడం టీపీసీసీలో కలకలం రేపింది. అక్కడ సోదాలు నిర్వహించిన సైబర్ క్రైమ్ పోలీసులు.. కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లతోపాటు, అక్కడ పనిచేస్తున్న కొందరి ఫోన్లను తీసుకెళ్లారు. అయితే కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫిర్యాదు మేరకు సోదాలు చేసినట్టుగా పోలీసు వర్గాలు చెబుతున్నాయి. తనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టింగులు వస్తున్నాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు సోదాలు జరిపినట్టుగా పేర్కొన్నాయి. అయితే ఈ సోదాల వెనక అధికార బీఆర్‌ఎస్ హస్తం ఉందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యూత్ కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్‌కు సంబంధించిన కంప్యూటర్లు, ఇతర డేటాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ఆరోపణలు చేసింది.
గత ఏడాది డిసెంబర్‌లో హైదరాబాద్ మాదాపూర్‌లో ఉన్న ఎన్నికల వ్యూహకర్త సునీల్ కానుగోలు, ఆయన బృందం నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ కోసం నిర్వహిస్తున్న వార్ రూమ్‌పై ఇలాగే దాడి చేసి సమాచారం దొంగిలించారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారని.. అందుకే యూత్ కాంగ్రెస్ వార్ రూమ్‌పై ప్రభుత్వమే దాడి చేయించిందని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధక్షుడు శివసేనారెడ్డి ఆరోపించారు. వార్ రూమ్‌లో తమ సమాచారాన్ని దొంగిలించారని ఆరోపణలు చేశారు.
‘‘బంజారాహిల్స్‌లోని మా వార్‌రూమ్‌పై ఎలాంటి వారెంట్, కోర్టు ఉత్తర్వులు చూపకుండానే పోలీసులు దాడులు చేశారు. గజ్వేల్, సిరిసిల్ల సహా 66 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వసతుల లేమి, ఇతర సమస్యలపై సమాచారాన్ని సేకరించాం’’ అని శివసేనారెడ్డి తెలిపారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి తనపై సోషల్ మీడియాలో అవమానకరమైన ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేసినప్పటికీ.. ఆ నంబర్‌ను ఉపయోగించి నిందితుడిపై చర్యలు తీసుకోకుండా పోలీసులు యూత్ కాంగ్రెస్ వార్ రూమ్‌పై దాడి చేయడమేమిటని ప్రశ్నించారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ట్రోలింగ్‌కు సంబంధించిన ఫోన్ నెంబర్ నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకుడు సీహెచ్ కృష్ణారెడ్డి పేరు మీద ఉందని.. దానిని యూత్ కాంగ్రెస్ నియమించిన ఉద్యోగుల్లో ఒకరు తమ వార్‌రూమ్‌లో పనిచేసేందుకు ఉపయోగిస్తున్నట్లు విచారణలో తేలిందని పోలీసు వర్గాలు తెలిపాయి.