దిశ ఎఫెక్ట్: తెలంగాణలో తొలి జీరో ఎఫ్ఐఆర్ నమోదు

By Nagaraju penumalaFirst Published Dec 7, 2019, 9:37 PM IST
Highlights

తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఓ యువతి మిస్సింగ్‌ కేసులో వరంగల్‌ జిల్లా సుబేదారి స్టేషన్ లో జీరో ఎఫ్ఐఆర్ ను నమోదు చేశారు పోలీసులు. 
 

వరంగల్‌ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలంగాణ వైద్యురాలు దిశ రేప్ హత్య ఘటనతో తెలంగాణ పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. దిశ ఘటనలో ఫిర్యాదు చేసేందుకు తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ కు వెళ్లగా తమ పరిధి కాదంటూ తిప్పడం పెద్ద దుమారమే రేగింది. 

పోలీసుల నిర్లక్ష్యం వల్లే దిశను కాపాడుకోలేకపోయామని దిశ తల్లిదండ్రులతోపాటు రాజకీయ నేతలు, ప్రజా సంఘాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేశాయి. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి చర్యలు తీసుకుని ఉంటే దిశను కనీసం ప్రాణాలతోనైనా కాపాడుకునేవాళ్లమని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ అంశంలో ఇప్పటికే పలువురు పోలీసులు సైతం సస్పెండ్ అయ్యారు. 
 
దాంతో మేల్కొన్న పోలీసు యంత్రాంగం జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఓ యువతి మిస్సింగ్‌ కేసులో వరంగల్‌ జిల్లా సుబేదారి స్టేషన్ లో జీరో ఎఫ్ఐఆర్ ను నమోదు చేశారు పోలీసులు. 

వివరాల్లోకి వెళ్తే శాయంపేట పోలీసు స్టేషన్ పరిధిలోని గోవిందాపూర్‌కు చెందిన 24 ఏళ్ల యువతి కనిపించడం లేదంటూ ఆమె కుటుంబ సభ్యులు సుబేదారి పోలీసులను ఆశ్రయించారు. యువతి చిన్నాన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో తొలి జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు కావడం పట్ల వరంగల్‌ సీపీ రవీందర్‌ హర్షం వ్యక్తం చేశారు. సుబేదారి పోలీసులను సీపీ అభినందించారు. ఆపదలో ఉన్నామంటూ ప్రజలు వస్తే మెుట్టమెుదట జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి చర్యలు చేపట్టాలని ఆ తర్వాత పరిధిలను బట్టి బదిలీ చేసుకోవాలని డీజీపీ ఆదేశించిన సంగతి తెలిసిందే.

 దిశ ఎఫెక్ట్: ఆడవాళ్ల కోసం జగన్ సర్కార్ సంచలన నిర్ణయం

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో సైతం జీరో ఎఫ్ఐఆర్‌ నమోదైంది. కృష్ణా జిల్లానందిగామలో మొదటిసారిగా బాలుడి మిస్సింగ్‌ కేసు సంబంధించి కంచికచర్ల పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. కంచికచర్ల పీఎస్‌ పరిధి కాకపోయినా కేసు నమోదు చేసిన పోలీసులు రెండు బృందాలతో బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

మిర్యాలగూడ మండలం వీరంపాడులో బాలుడిని గుర్తించిన పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. దాంతో ఏపీలో మెుట్టమెుదటి జీరో ఎఫ్ఐఆర్ కేసు కృష్ణా జిల్లాలో నమోదు కాగా మిస్సైన బాలుడిని మాత్రం తెలంగాణ పట్టుకోవడం విశేషం. 
 

click me!