కన్నబిడ్డ ఫస్ట్ క్లాస్ లో పాసయినా... ఆ తల్లిదండ్రులకు కన్నీరునే మిగిల్చిన పది ఫలితాలు

By Arun Kumar PFirst Published Jul 1, 2022, 1:20 PM IST
Highlights

ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన పదో తరగతి విద్యార్థి నిన్న(గురువారం) తెలంగాణలో వెలువడిన పది ఫలితాల్లో ఫస్ట్ క్లాస్ లో పాసయ్యాడు. అయినప్పటికి అతడికి తల్లిదండ్రులకు శోకమే మిగిలింది. 

గద్వాల : తెలంగాణలో వెలువడిన పదో తరగతి పరీక్షా పలితాలు ఆ తల్లిదండ్రుల చేత మరోసారి కన్నీరు పెట్టించాయి. ఇటీవల ఒక్కగానొక్క కొడుకును కోల్పోయి ఇప్పుడిప్పుడే ఆ బాధనుండి బయటకువస్తున్న తల్లిదండ్రులను ఈ ఫలితాలు మరోసారి బాధపెట్టాయి. చనిపోయిన కొడుకు పదో తరగతిలో ప్రథమ శ్రేణిలో పాసయినా ఆ తల్లిదండ్రులకు పుట్టెడు శోకమే మిగిలింది. 

వివరాల్లోకి వెళితే... జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం చిన్న తాండ్రపాడు గ్రామానికి చెందిన చంద్రకళ, ఆంజనేయులు భార్యాభర్తలు. గ్రామంలో సరయిన ఉపాధి లభించకపోవడం, కొడుకు చదువు కోసం వనపర్తి జిల్లా పెబ్బేరుకు వలసవెళ్లారు. ఇలా గత 20ఏళ్ళుగా పెబ్బేరులోనే నివాసముంటున్నారు. 

ఈ దంపతుల కొడుకు రాకేష్ (16) స్థానికంగా ఓ ప్రైవేట్ స్కూల్లో పదో తరగతి చదివాడు. పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న క్రమంలో దారుణం చోటుచేసుకుంది. రాకేష్ గత నెల జూన్ 19వ తేదీన స్నేహితులతో కలిసి బావిలో ఈతకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందాడు. 

తమకు తలకొరివి పెట్టాల్సిన కొడుకుకు తామే పెట్టాల్సి రావడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అప్పటికే పక్షపాతంతో తండ్రి మంచానపడటంతో కుటుంబ బాధ్యత తల్లిపై పడింది. ఆమెకు చేదోడువాదోడుగా వుంటున్న కొడుకు మృతి ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. కొడుకు మృతి బాధనుండి ఇప్పడిప్పుడే కాస్త భయటకు వస్తున్న తల్లిదండ్రులను పదోతరగతి పలితాలు మరోసారి కన్నీరు పెట్టించాయి. 

కొడుకుకు పదో తరగతిలో 8.8 జిపిఏ తో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడైనా ఆనందించే పరిస్థితిలో ఆ తల్లిదండ్రులు లేరు. ఈ ఫలితాలను చూసి భావోద్వేగానికి లోనయిన ఆ తల్లిదండ్రులను కొడుకుని తలచుకుని ఏడవటం చూసేవారికి కన్నీరు తెప్పించింది. రాకేష్ స్నేహితులు సైతం అతడికి తలచుకుని బాధపడుతున్నారు. 

ఇలాంటి విషాద ఘటనే ఇంటర్ ఫలితాల సమయంలో వెలుగులోకి వచ్చింది. ఇంటర్ పరీక్షలు ముగియడంతో తండ్రితో కలిసి ఇంటికి బయలుదేరిన యువతి రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. అయితే ఇంటర్ పరీక్ష ఫలితాల్లో ఆ యువతి చదువుతున్న కాలేజ్ లో టాపర్‌గా నిలిచింది. అంతా ప్రతిభ కలిగిన విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మృతిచెందడాన్ని గుర్తుచేసుకుని అటు కుటుంబ సభ్యులు, ఇటు టీచర్స్, స్నేహితురాళ్లు బాధపడ్డారు. ఈ ఘటన కూడా జోగులాంబ గద్వాల జిల్లాలోనే చోటుచేసుకుంది. 
 
ఇక పదో తరగతి పలితాలకంటే ముందే వెలువడిన తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు కూడా కొన్ని కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. పరీక్షలో ఫెయిలై కొందరు, తక్కువ మార్కులు వచ్చాయని మరికొందరు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలా మనస్థాపంతో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల బలవన్మరణాలు కొనసాగుతున్నాయి.  

గత బుధవారం మరో ఇద్దరు ఇంటర్మీడియట్ విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ విద్యార్థి (17) ఎంపీసీ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాశాడు. అయితే ఇటీవల వెలువడిన ఫలితాల్లో ఐదు సబ్జెక్టుల్లో ఫెయిలయ్యాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయిన యువకుడు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఫెయిల్ అవడం అవమానంగా భావించి ఆత్మహత్య చేసుకున్నాడు. 

ఇక హైదరాబాద్ మలక్ పేట ప్రాంతానికి చెందిన మరో విద్యార్థిని (19) ఇంటర్ లో ఉత్తీర్ణత సాధించకపోవడంతో తండ్రి మందలించాడని ఆత్మహత్య చేసుకుంది. తీవ్ర మనస్థాపానికి గురైన యువతి మంగళవారం రాత్రి  తన గదిలో ఉరివేసుకొని మృతి చెందింది.

 
 

click me!