బాబ్లీ ప్రాజెక్టు కేసు: చంద్రబాబుకు త్వరలో ధర్మాబాద్ కోర్టు నోటీసులు

By narsimha lodeFirst Published Sep 13, 2018, 11:11 AM IST
Highlights

 బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని  నిరసిస్తూ 2010లో  మహారాష్ట్రలో నిర్వహించిన ఆందోళనలో అప్పటి ఉమ్మడి ఏపీ రాష్ట్ర విపక్షనేత చంద్రబాబునాయుడుకు మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.

అమరావతి: బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని  నిరసిస్తూ 2010లో  మహారాష్ట్రలో నిర్వహించిన ఆందోళనలో అప్పటి ఉమ్మడి ఏపీ రాష్ట్ర విపక్షనేత చంద్రబాబునాయుడుకు మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.

2010లో తెలంగాణలో ఉప ఎన్నికలు జరిగే సమయంలో బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణలో శ్రీరాం సాగర్ ప్రాజెక్టు సహా గోదావరిపై ఉన్న  ప్రాజెక్టులు ఎండిపోయే అవకాశం ఉంది. దీంతో బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని నిరసిస్తూ చంద్రబాబునాయుడు సహా ఆనాడు టీడీపీకి చెందిన ప్రజా ప్రతినిధులు ఆందోళన నిర్వహించారు.

అయితే  అనుమతిలేకుండా బాబ్లీ ప్రాజెక్టు వద్ద నిరసన వ్యక్తం చేశారనే నెపంతో అప్పట్లో  చంద్రబాబునాయుడు సహా టీడీపీ ప్రజా ప్రతినిధులను మహారాష్ట్ర ప్రభుత్వం  అరెస్ట్ చేసింది. 

మహారాష్ట్రలోని ఓ ఐటీఐ కాలేజీలో  టీడీపీ ప్రజా ప్రతినిధులను నిర్భంధించారు. అయితే  అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ  చంద్రబాబునాయుడు బెయిల్ ను కూడ తిరస్కరించారు.

ఆనాడు ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. మహారాష్ట్రలో కూడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆనాడు సీఎంగా ఉన్న రోశయ్య మహారాష్ట్రతో సంప్రదింపులు జరిపారు.  ఈ పరిస్థితుల నేపథ్యంలో బాబు సహా ఇతర టీడీపీ ప్రజాప్రతినిధులను మహారాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.

అయితే ఈ ఘటనకు సంబంధించిన త్వరలోనే ధర్మాబాద్ కోర్టు చంద్రబాబునాయుడుకు నోటీసులు జారీచేసే అవకాశం ఉందని మహారాష్ట్రకు చెందిన మీడియా వార్తలను ప్రచురించింది.

ఈ విషయమై  ఏపీ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గురువారం నాడు స్పందించారు.  తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం ఆనాడు టీడీపీ బాబ్లీ పోరాటం చేసిన విషయాన్ని లోకేష్ గుర్తు చేశారు.  ధర్మాబాద్ కోర్టు నోటీసులు జారీ చేస్తే  కోర్టుకు హాజరౌతామని ఆయన చెప్పారు.

బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని నిరసిస్తూ  టీడీపీ తెగువ చూపిందని ఆయన గుర్తు చేశారు.  కోర్టులను గౌరవిస్తామని లోకేష్ తెలిపారు. మరోవైపు అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు వెళ్లే ఆలోచన తమకు లేదన్నారు. అభివృద్ది విషయమై తాము కేంద్రీకరించినట్టు లోకేష్ చెప్పారు. 

click me!