
ఇబ్రహీంపట్నం సీహెచ్‌సీలో డీహెచ్ శ్రీనివాస్ రావు నేతృత్వంలోని శుక్రవారం పర్యటించింది. ఇటీవల ఇబ్రహీపట్నం సీహెచ్‌సీలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న నలుగురు మహిళలు మృతిచెందడం తీవ్రకలకం రేపిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ ఘటనపై డీహెచ్‌ను విచారణాధికారిగా నియమించింది. వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే డీహెచ్ శ్రీనివాసరావు నేతృత్వంలోని బృందం ఇబ్రహీంపట్నం ఆస్పత్రిని సందర్శించింది. ఆస్పత్రిలో ఆపరేషన్ చేసిన గది, పరికరాలను ఈ బృందం పరిశీలించింది.
అనంతరం డీహెచ్ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ.. ఆస్పత్రులతో చికిత్స పొందుతున్న 30 మంది మహిళల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. నిన్న ఒక్కరిని డిచార్జ్ చేసినట్టుగా తెలిపారు. ఈ రోజు మరో 11 మందిని డిశ్చార్జ్ చేయడం జరుగుతుందన్నారు. మరో 18 మందిని వైద్యుల పర్యవేక్షణ అనంతరం రానున్న రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేయనున్నట్టుగా చెప్పారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగిన రోజు విధుల్లో ఉన్న సిబ్బందిని పూర్తిగా విచారించడం జరిగిందన్నారు. రానున్న ఒకటి రెండు రోజుల్లోనే పూర్తి నివేదికను ప్రభుత్వానికి పంపించడం జరుగుతుందన్నారు.
ఆగస్టు 25వ తేదీన ఆపరేషన్ చేసిన తర్వాత పూర్తి ఆరోగ్యం ఉన్నారని నిర్దారించుకున్న తర్వాతే సాయంత్రానికి డిశ్చార్జ్ చేయడం జరిగిందన్నారు. నలుగురు మహిళల మరణాలకు కారణాలేమిటనేది తెలియాల్సి ఉందన్నారు. అన్ని కోణాల్లో ఇందుకు సంబంధించి విచారణ జరుపుతున్నామని చెప్పారు. ఆస్పత్రిలో వాడిన పరికరాలను ల్యాబ్ పంపించడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
ఇక, ఈ ఘటనకు సంబంధించి ఇబ్రహీంపట్నం సీహెచ్‌సీ సూపరింటెండెంట్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రోజు ఆపరేషన్ చేసిన సర్జన్ లైసెన్సును తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తాత్కాలికంగా రద్దు చేసింది.