బేగంపేట మెడికవర్ ఆసుపత్రిలో శుక్రవారం నాడు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫైరింజన్లు మంటలనుఆర్పుతున్నారు.
హైదరాబాద్: హైద్రాబాద్ నగరంలోని బేగంపేట మెడికవర్ ఆసుపత్రిలో శుక్రవారం నాడు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆసుపత్రిలోని ఆరో అంతస్థులో వెల్డింగ్ పనులు నిర్వహిస్తున్న సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో ఆసుపత్రిలో సిబ్బంది, రోగులు భయాందోళనలకు గరరయ్యారు. ఆసుపత్రి యాజమాన్యం ఫైరింజన్లకు సమాచారం ఇచ్చారు. ఫైరింజన్లు మంటలను ఆర్పుతున్నాయి. గతంలో ఈ భవనంలో వేరే ఆసుపత్రి ఉండేది. అయితే ఈ భవనంలోకి మెడికవర్ ఆసుపత్రిని ఇటీవలనే మార్చారు. దీంతో మరమ్మత్తు పనులను మెడికవర్ ఆసుపత్రి యాజమాన్యం చేపట్టింది. ఆరో అంతస్తులో మరమ్మత్తులు చేపట్టారు. ఈ క్రమంలోనే వెల్డింగ్ పనులు చేస్తున్నారు.
ఈ సమయంలోనే మంటలు చెలరేగాయి. ఆసుపత్రిలో దట్టమైన పొగ వ్యాపించింది. ఆసుపత్రి సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం తో వెంటనే పైరింజన్లు రంగగంలోకి దిగి మంటలను ఆర్పాయి.ఈ ఏడాది మార్చి మాసంలో హైద్రాబాద్ సలీం నగర్ లో ని ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్నిప్రమాదం నుండి రోగులు సురక్షితంగా బయటపడ్డారు.
2020 ఆగస్టు 9వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో స్వర్ణ ప్యాలెస్ హోటల్ లో కోవిడ్ కేర్ సెంటర్ లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటన తర్వాత భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు ఆసుపత్రుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించిన విషయం తెలిసిందే.