సిద్ధిపేటలో దేశపతికి షాక్ ఇచ్చిన రెడ్డి జాగృతి

First Published Sep 8, 2017, 5:20 PM IST
Highlights
  • నిలదీసిన రెడ్డి జాగృతి కార్యకర్తలు
  • రెడ్డీలపై పరుష విమర్శలు చేశారెందుకని ప్రశ్న
  • క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్
  • మీడియా ముందు క్షమాపణ చెబుతానన్న దేశపతి
  • అంతలోనే అక్కడి నుంచి వెళ్లిపోయిన దేశపతి

తెలంగాణ కవి, గాయకుడు, ఉద్యమకారుడు దేశపతి శ్రీనివాస్ కు సొంత జిల్లాలోనే అనూహ్యంగా చేదు అనుభవం ఎదురైంది. ఆయనకు సిద్ధిపేట లో షాక్ తగిలింది. రెడ్డి జాగృతి కార్యకర్తలు ఆయనను నిలదీశారు. దీంతో దేశపతి అయోమయంలో పడిపోయారు.

ఈ సంఘటనకు సంబంధించి రెడ్డి జాగృతి కార్యకర్తలు ఇచ్చిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. గురువారం సిద్ధిపేటలోని టిఎన్జిఓ భవన్ లో ఒక పుస్తక ప్రదర్శనలో పాల్గొనేందుకు దేశపతి శ్రీనివాస్ అక్కడికి వెళ్లారు. అయితే ఆయన వచ్చిండని తెలుసుకున్న స్థానిక రెడ్డి జాగృతి నేత ఊదర మణిదీప్ రెడ్డి, బెండారం శ్రీనివాసరెడ్డి తోపాటు మరికొందరు నాయకులు, కార్యకర్తలు వచ్చారు.

ఈ సందర్భంగా దేశపతితో వారు వాగ్వాదానికి దిగారు. ఎందుకు రెడ్డీలపై పరుశమైన విమర్శలు చేశారంటూ నిలదీశారు. దీంతో దేశపతి స్పందిస్తూ తాను రెడ్డీలపై ఎలాంటి విమర్శలు చేయలేదని సమాధానమిచ్చారు. అయితే వెంటనే ఆ కార్యకర్తలు ఇవి మీరు మాట్లాడిన మాటలేనా కాదా? అంటూ ఇటీవల ఒక టివి చానెల్ లో రెడ్డీపై నడిపిన చర్చలోని వీడియోలను దేశపతికి చూపించారు. అందులో ఆయన మాటలను వినిపించారు. దీంతో దేశపతి కొంత ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. అయితే ఇప్పుడేం చేద్దామంటూ దేశపతి వారిని ప్రశ్నించారు. తమకు మీరు తక్షణమే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.

అయితే ఇక్కడ నలుగురిలోనే క్షమాపణ చెప్పడం భావ్యం కాదు కదా? జనాల్లో క్షమాపణ చెబుతానని దేశపతి బదులిచ్చారు. మీడియా రాగానే మీడియా ముందే క్షమాపణ చెబుతానని చెప్పారు. కొద్దిసేపటి తర్వాత దేశపతి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఇక్కడ మరో ట్విస్ట్ ఏమంటే..? ఈ కార్యక్రమానికి టిఆర్ఎస్ నేత, మాజీ టిఎన్జిఓ నేత దేవీ ప్రసాదరావు కూడా హాజరు కావాల్సి ఉంది. అయితే దేశపతికి ఇలా జరిగిందని తెలియడంతో దేవీప్రసాదరావు ఆ కార్యక్రమానికి హాజరుకాకుండా డ్రాప్ అయ్యారు. ప్రస్తుతం ఈ సంఘటన రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

 

click me!