మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో రోడ్డు రోలర్ గుర్తుపై వివాదం నడుస్తోంది. కారు గుర్తును పోలి వున్న దీనిని తొలగించాలంటూ టీఆర్ఎస్ ఈసీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో హైదరాబాద్‌కు డిప్యూటీ ఎలక్షన్ కమీషనర్ వచ్చారు.
మునుగోడు ఉపఎన్నికలో ఎలాగైనా విజయం సాధించాలని అధికార టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. హుజురాబాద్ మాదిరిగా హడావుడి లేకుండా సైలెంట్‌గా తన పని చేసుకుపోతోంది. నియోజకవర్గాన్ని యూనిట్లుగా విభజించి మంత్రులు, ఎమ్మెల్యేలను ఇన్‌ఛార్జులగా నియమించారు ముఖ్యమంత్రి కేసీఆర్. అలాగే గత అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తును పోలిన బుల్డోజర్ తదిరత సింబల్స్ వల్ల ఓటర్లు అయోమయానికి గురయ్యారు. ఈసారి అలాంటి నష్టం కలగకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంది టీఆర్ఎస్.
దీనిలో భాగంగా కారు గుర్తును పోలిన 8 గుర్తులు వున్నాయని.. వాటిని తొలగించాలని ఈ నెల 10 తెలంగాణ ఎన్నికల కమీషనర్‌కు టీఆర్ఎస్ లేఖ రాసింది. ఎన్నికల గుర్తు జాబితా నుంచి కెమెరా, చపాతి రోలర్, డాలీ, రోడ్ రోలర్, సబ్బు డబ్బా, టీవీ, కుట్టు మిషన్, ఓడను తొలగించాలని విజ్ఞప్తి చేసింది. అయితే ఈసీ నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించగా... అక్కడా షాక్ తగిలింది. ఎన్నికల గుర్తును తొలగించాలన్న టీఆర్ఎస్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.
ALso Read:టీఆర్ఎస్‌కి తెలంగాణ హైకోర్టు షాక్: కారు గుర్తును పోలిన గుర్తులపై గులాబీ పార్టీ పిటిషన్ కొట్టివేత
అంతకుముందు సీనియర్ నేత వినోద్ కుమార్‌ను ఢిల్లీకి పంపింది టీఆర్ఎస్. వినోద్‌తో పాటు రాష్ట్ర అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావులు... కేంద్ర ఎన్నికల కమీషన్ సభ్యుడు అనూప్ చంద్ర పాండేను కలిసి రోడ్డు రోలర్ గుర్తుపై ఫిర్యాదు చేశారు. ఆ గుర్తు కారును పోలి వుందని.. గతంలో 2011లో ఇలాగే రోడ్డు రోలర్‌పై తమ ఫిర్యాదు ఆధారంగా దానిని ఈసీ తొలగించిందని వారు గుర్తుచేశారు.
ఈ నేపథ్యంలో గురువారం కేంద్ర ఎన్నికల కమీషన్ డిప్యూటీ కమీషనర్ హైదరాబాద్ వచ్చారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారితో భేటీ అయిన ఆయన.. ఈ వివాదంపై జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుంచి వివరణ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.