దళితుడైనందునే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను చిన్న పీట మీద కూర్చోబెట్టారని వస్తున్న విమర్శలపై భట్టి స్పందించారు. తానే కావాలని చిన్నపీట మీద కూర్చున్నానని వివరించారు.
Bhatti Vikramarka: యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రుల పూజలకు సంబంధించి ఓ విషయం వివాదాస్పదమైంది. పూజ సందర్బంలో సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు పెద్ద పీటపై కూర్చున్నారు. కానీ, డిప్యూటీ సీఎం భట్టి మాత్రం చిన్న పీటపై కూర్చున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. డిప్యూటీ సీఎం అయినప్పటికీ భట్టి విక్రమార్క ఓ దళితుడు కాబట్టే.. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సీఎం, ఇతర మంత్రులు ఆయనను చిన్న పీట మీద కూర్చోబెట్టారనే వాదనలు జరిగాయి. దేవుడి సమక్షంలో దళితుడికి అన్యాయం జరిగిందని నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
ముఖ్యంగా బీఆర్ఎస్, బీఎస్పీ నాయకులు ఈ ఘటన పేర్కొంటూ అధికార కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డాయి. కాంగ్రెస్ ముఖ్య నాయకులలో ఇప్పటికీ కుల వివక్ష జీర్ణించుకునే ఉన్నదని, అందుకే తోటి క్యాబినెట్ సభ్యుడిని దళితుడైనందున వారి కంటే చిన్న పీటపై కూర్చోబెట్టారని ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్వయంగా రియాక్ట్ అయ్యారు.
Also Read: Viveka Murder: సీఎం జగన్ నుంచి ప్రాణహాని.. కోర్టులో దస్తగిరి పిటిషన్
యాదాద్రిలో జరిగిన ఘటనపై అర్థం పర్థం లేకుండా ఆరోపణలు చేస్తున్నారని, ట్రోల్ చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. లక్ష్మీ నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు చేశామని ఆయన చెప్పారు. అయితే.. తాను కావాలనే చిన్న పీట మీద కూర్చున్నా అని వివరించారు. ఉప ముఖ్యమంత్రిగా తాను రాష్ట్రాన్ని శాసిస్తున్నానని అన్నారు. తాను ఎవరికీ తలవంచేవాడిని కాదని, ఎవరో పక్కన కూర్చోబెడితే కూర్చునేవాడిని కాదని స్పష్టం చేశారు. తనది ఆత్మగౌరవాన్ని చంపుకునే మనస్తత్వం కాదని తెలిపారు. దీంతో కాంగ్రెస్ పార్టీపై వచ్చిన విమర్శలకు ఆయన ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. బంజారా హిల్స్‌లో మీడియాతో మాట్లాడుతూ భట్టి ఈ వ్యాఖ్యలు చేశారు.