ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారిస్తున్నారు. ఆరు గంటలకు పైగా విచారణ కొనసాగుతుంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారిస్తున్నారు. ఈ రోజు ఉదయం 10.30 గంటలకే కవిత ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. దాదాపు ఆరు గంటలకు పైగా కవితను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి సౌత్ గ్రూప్‌లో ఉన్న వ్యక్తులతో కవితకు సంబంధాలు, ఆర్థిక లావాదేవీల గురించి ఈడీ అధికారులు ఆమెను ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో ఈరోజు విచారణలో భాగంగా.. తమ కస్టడీలో ఉన్న హైదరాబాద్ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైతో కలిపి ఈడీ అధికారులు కవితను విచారించారు.
రెండు గంటలకు పైగా కవితను, అరుణ్ రామచంద్ర పిళ్లైని కన్‌ఫ్రంటేషన్ పద్ధతిలో ఈడీ అధికారులు విచారించినట్టుగా తెలుస్తోంది. కవితకు బినామీ అని అరుణ్ రామచంద్ర పిళ్లై చెప్పారని పేర్కొన్న ఈడీ.. అందుకు సంబంధించిన ప్రశ్నలపై సమాధానాలు రాబట్టేందుకు యత్నించినట్టుగా తెలుస్తోంది.
ఆ తర్వాత అరుణ్ రామచంద్ర పిళ్లైని.. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే కోర్టు రామచంద్ర పిళ్లైకి ఏప్రిల్ 3వ తేదీ వరకు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. ఇక, ప్రస్తుతం ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ఒంటరిగానే విచారిస్తున్నారు. ఐదుగురు అధికారులు బృందం కవితను విచారిస్తుందని.. అందులో ఒక మహిళా అధికారి కూడా ఉన్నారని సమాచారం. అయితే ఈరోజు ఎన్ని గంటల వరకు కవితను విచారిస్తారనే దానిపై స్పష్టత లేకుండా పోయింది.
ఇక, ఈ కేసుకు సంబంధించి కవిత.. తొలుత ఈ నెల 11న ఈడీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. అయితే ఈ నెల 16న మరోసారి విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు నోటీసులు సమన్లు జారీ చేసిన.. కవిత ఆ రోజు విచారణకు గైర్హాజరయ్యారు. ఈ క్రమంలోనే కవిత ఈడీ అధికారులకు లేఖ రాశారు. అందులో పలు అంశాలను ప్రస్తావించారు. ఈడీ జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను మార్చి 24కి సుప్రీంకోర్టు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని కూడా కవిత లేఖలో ప్రస్తావించారు. తాను వ్యక్తిగతంగా రావాలని సమన్లలోని ఎక్కడ పేర్కొనలేదని.. తన ప్రతినిధిగా భరత్‌ను ఈడీ కార్యాలయానికి పంపుతున్నానని చెప్పారు. సమన్లలో అడిగిన వివవరాలను కూడా భరత్ ద్వారా పంపుతున్నానని చెప్పారు. దీంతో భరత్ ఈడీ కార్యాలయానికి చేరుకుని.. ఈడీ అడిగిన వివరాలను సమర్పించారు. అయితే ఈడీ ఈ నెల 20 మరోసారి విచారణకు రావాల్సిందిగా కవితకు నోటీసులు జారీచేసింది. దీంతో కవిత నేడు మరోమారు ఈడీ విచారణకు హాజరయ్యారు.