డిల్లీ పునాదులను కదిలించిన కేసీఆర్ కు... మరోసారి అండగా నిలుద్దాం: కవిత పిలుపు

By Arun Kumar PFirst Published Nov 29, 2020, 11:14 AM IST
Highlights

ఇవాళ దీక్షా దివస్ ను పురస్కరించుకుని మరోసారి సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలు అండగా వుండాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోషల్ మీడియా ద్వారా కోరారు. 
 

హైదరాబాద్: సరిగ్గా పదకొండేళ్ల క్రితం ఇదే నవంబర్ 29వ తేధీన తెలంగాణ రాష్ట్రం కోసం ఆనాటి టీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ నిరాహార దీక్షకు దిగిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన సీఎం కేసీఆర్ తాను దీక్ష ప్రారంభించిన నవంబర్ 29ను ''దీక్షా దివస్'' గా ప్రకటించారు. ఇవాళ దీక్షా దివస్ ను పురస్కరించుకుని మరోసారి సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలు అండగా వుండాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోషల్ మీడియా ద్వారా కోరారు. 

''కేసీఆర్ సచ్చుడో..తెలంగాణ వచ్చుడో అన్న నినాదంతో, ప్రత్యేక రాష్ట్రం కోసం టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన రోజు దీక్షా దివస్(నవంబర్ 29, 2009) కు నేటితో పదకొండేళ్లు. యావత్ తెలంగాణ ప్రజలను ఏకం చేసి, ఢిల్లీ పునాదులను కదిలించిన దీక్షా దివస్ స్పూర్తితో తెలంగాణ ప్రగతికి పునరంకితమవుదాం. కేసిఆర్ గారికి అండగా ఉందాం జై కేసీఆర్! జై తెలంగాణ!!'' అంటూ జిహెచ్ఎంసి ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతివ్వాలని ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. 

ఇదిలావుంటే గాంధీనగర్ డివిజన్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా పాదయాత్ర చేపట్టారు. జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేపట్టిన ఈ పాదయాత్ర ప్రారంభించారు‌. డివిజన్ లోని పలు బస్తీలు, కాలనీల్లో పాదయాత్ర చేస్తూ ప్రజలను పలకరిస్తున్నారు ఎమ్మెల్సీ కవిత. దాదాపు 500 మందికి పైగా కార్యకర్తలు, నాయకులతో కలిసి ఆమె పాదయాత్ర చేస్తున్నారు.

గత ఆరేండ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, టీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రజలతో పంచుకుంటున్నారు. ముషీరాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, గాంధీనగర్ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి ముఠా పద్మ నరేష్, నాయకులు జైసింహ, శ్రీధర్ రెడ్డి ఈ పాదయాత్రలో పాల్గొన్నారు.

click me!