పల్లె-పట్టణ ప్రగతి కార్యక్రమం తేదీల్లో మార్పు.. కేసీఆర్ నిర్ణయం, కొత్త డేట్స్ ఇవే

Siva Kodati |  
Published : May 18, 2022, 02:23 PM ISTUpdated : May 19, 2022, 10:16 AM IST
పల్లె-పట్టణ ప్రగతి కార్యక్రమం తేదీల్లో మార్పు.. కేసీఆర్ నిర్ణయం, కొత్త డేట్స్ ఇవే

సారాంశం

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు సంబంధించి తేదీలు మారాయి. మే 20న జరగాల్సిన కార్యక్రమాన్ని వాయిదా వేసిన కేసీఆర్.. జూన్ 3 నుంచి మొదలు పెడతామని స్పష్టం చేశారు.

పల్లె- పట్టణ ప్రగతి (palle pattana pragathi) తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నెల 20 నుంచి జూన్ 3వ తేదీ వరకు దీనిని వాయిదా వేసింది ప్రభుత్వం. జూన్ 3 నుంచి 15 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. రాష్ట్రంలో ఎండల తీవ్రతతో సీఎం కేసీఆర్ (kcr) ఈ నిర్ణయం తీసుకున్నారు. తడిసిన ధాన్యాన్ని చివరి గింజ వరకు కొంటామని ముఖ్యమంత్రి తెలిపారు. అందువల్ల రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం భరోసా ఇచ్చారు. 

రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలు కోసం చేపట్టాల్సిన కార్యాచరణతో పాటు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణాలు, వరి ధాన్యం సేకరణ, జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణకు సంబంధించి బుధవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 

విధ్వంసం అనంతరం వ్యవస్థలను పునర్న్మించుకోవడం చాలా కష్టమైన పని అని అన్నారు. ఆరు దశాబ్దాల ఉమ్మడి రాష్ట్ర పాలనలో ధ్వంసమైన తెలంగాణను తిరిగి బాగు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చాలా కష్టపడాల్సి వస్తున్నదని చెప్పారు.  అన్ని కష్టాలను అధిగమించి నేడు దేశం గర్వించే స్థాయిలో తెలంగాణ పల్లెలను, పట్టణాలను అభివృద్ధి చేసుకుంటున్నామని తెలిపారు. మనం చేస్తున్న పనిని ఇతరులు గుర్తించడమే ప్రగతికి కొలమానమనీ.. పల్లె ప్రగతి,పట్టణ ప్రగతి కార్యక్రమాలకు దేశవ్యాప్తంగా విశేషమైన గుర్తింపు, ఆదరణ లభించిందని హర్షం వ్యక్తం చేశారు. 

రెండు పర్యాయాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ గ్రామాల్లో మొదటి దశలో పదికి పది గ్రామాలు, రెండవ దశలో 20కి 19 గ్రామాలు తెలంగాణ నుంచే ఎంపిక కావడం గొప్ప విషయమని అన్నారు.  ఈ దిశగా కృషి చేసిన పంచాయతీ రాజ్ శాఖను, మంత్రిని సీఎం కేసీఆర్ అభినందించారు. ఈ సందర్భంగా..కర్ణాటక రాష్ట్రానికి చెందిన పచ్చదనం,పర్యావరణ పరిరక్షణ కోసం తన జీవితాన్ని అర్పించిన, 110 సంవత్సరాల పద్మశ్రీ తిమ్మక్క గారిని మంత్రులు ఉన్నతాధికారుల సమక్షంలో ఘనంగా సీఎం కేసిఆర్ సన్మానించారు.

ఇదే సమయంలో .. కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు. నేరుగా పల్లెలకు కేంద్రం నిధులు పంపడం చిల్లర వ్యవహారం అని విమర్శించారు. ఢిల్లీ నుంచి నేరుగా కేంద్రమే పథకాలను అమలు చేయాలని అనుకోవడం సరికాదని అన్నారు. స్థానిక సమస్యలు రాష్ట్ర ప్రభుత్వాలకే తెలుస్తాయని అన్నారు. రోజువారి కూలీ డబ్బులు కూడా నేరుగా కేంద్రమే పంచాలనుకోవడం సరైందా అని ప్రశ్నించారు. దేశంలో ఇంకా చాలా ప్రాంతాల్లో కరెంటు లేక పల్లెలు, పట్టణాలు చీకట్లలో మగ్గుతున్నాయని అన్నారు. త్రాగునీరు, సాగునీరు లేక ప్రజలు రోడ్ల మీదకు ఎక్కుతున్నారని చెప్పారు. విద్య, వైద్య రంగాల్లో ఆశించిన స్థాయిలో ప్రగతి లేదన్నారు. కేంద్రం వీటిపై దృష్టి పెట్టకుండా రాష్ట్రాల విధుల్లో జోక్యం చేసుకోవడం సరికాదని మండిపడ్డారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్