రేవంత్‌తో సునీల్, ఠాగూర్ కుమ్మక్కు... ఫ్రాంఛైజీలా టీపీసీసీ, కాంగ్రెస్‌లో వుండలేను : దాసోజు శ్రవణ్

By Siva KodatiFirst Published Aug 5, 2022, 5:44 PM IST
Highlights

కాంగ్రెస్ పార్టీకి దాసోజు శ్రవణ్ రాజీనామా చేశారు. రేవంత్ పీసీసీ అయ్యాక పరిస్ధితులు మారిపోయానని.. ఎన్నో నిద్రలేని రాత్రుళ్లు గడిపానని శ్రవణ్ ఆవేదన వ్యక్తం చేశారు. 

పేదవాడికి సేవ చేయడంతో పాటు పదిమంది జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చానన్నారు తెలంగాణ కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రజా రాజ్యం , టీఆర్ఎస్, కాంగ్రెస్‌లో చేరినది అందుకేనన్నారు. 2014లో తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని.. ముగ్గురు పీసీసీ చీఫ్‌ల నేతృత్వంలో పనిచేశానని చెప్పారు. రేవంత్ పీసీసీ అధ్యక్షుడిగా పగ్గాలు అందుకున్న తర్వాత పార్టీలో రాజకీయం అంటే కులం, ధనం అనే అరాచకమైన పరిస్ధితులు .. సామాజిక న్యాయ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా టీపీసీసీలో దుర్మార్గమైన పరిస్ధితులు చోటు చేసుకున్నాయన్నారు. 

ఈ పరిణామాలు తనను తీవ్రంగా కలిచివేశాయని.. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని శ్రవణ్ ఆవేదన వ్యక్తం చేశారు. సోనియా, రాహుల్‌ల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా రేవంత్ పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎన్నికల వ్యూహకర్త సునీల్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్యం ఠాగూర్, పీసీసీ చీఫ్ రాహుల్ గాంధీలు కుమ్మక్కయ్యారని శ్రవణ్ ఆరోపించారు. రేవంత్ రెడ్డికి వీరిద్దరూ వత్తాసు పలుకుతూ... టీపీసీసీని భ్రష్టు పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. 

ALso REad:కాంగ్రెస్ కు షాక్: పార్టీకి గుడ్ బై చెప్పిన దాసోజు శ్రవణ్

ఎవరైనా ప్రశ్నిస్తే.. అలాంటి నేతలపై తప్పుడు నివేదికలు ఇస్తున్నారని శ్రవణ్ ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నామరూపాల్లేకుండా చేయాలని చూస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. తమ వర్గం నేతల్ని బలమైన నాయకులుగా చిత్రీకరిస్తూ.. ఇతరులు బలహీనులనే ముద్రవేస్తున్నారని శ్రవణ్ మండిపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్‌లో అగ్రకుల దురహంకారం నడుస్తోందని.. ఇది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో బీసీ, ఎస్సీలు కాంగ్రెస్ పార్టీకి దూరమవుతారని శ్రవణ్ ఆందోళన వ్యక్తం చేశారు. 

సొంతపార్టీ వాళ్లే కాంగ్రెస్‌లోని నేతల్ని బలహీనపరుస్తున్నారని.. సొంత ముఠాతో కాంగ్రెస్‌ను హస్తగతం చేసుకోవాలని చూస్తున్నారని శ్రవణ్ ఆరోపించారు. ఏఐసీసీ నుంచి ఒక ఫ్రాంచైజ్ తీసుకున్నట్లు రేవంత్ వ్యవహరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మాఫియాను నడిపినట్లుగా పార్టీని నడుపుతున్నారని శ్రవణ్ ఆరోపించారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయడం రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ వల్ల కాదన్నారు. రేవంత్ దగ్గర తిరుమల తరహాలో ఎల్ 1, ఎల్ 2 , ఎల్ 3, దర్శనాలు వుంటాయని ఆయన దుయ్యబట్టారు. ఇక వీటిని తట్టుకునే శక్తి తనకు లేదని.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాని శ్రవణ్ ప్రకటించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి , పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 

click me!