Khairatabad: ఎమ్మెల్సీగా దాసోజు శ్రవణ్‌!.. దానం నాగేందర్‌కు లైన్ క్లియర్.. మంత్రివర్గ భేటీలో కీలక నిర్ణయం

By Mahesh K  |  First Published Jul 31, 2023, 8:56 PM IST

కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన మంత్రిమండలి సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది. దాసోజు శ్రవణ్‌ను ఎమ్మెల్సీగా చేయాలని నిర్ణయించింది. దీంతో ఖైరతాబాద్ నుంచి మళ్లీ పోటీ చేయడానికి సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు లైన్ క్లియర్ అయింది.


హైదరాబాద్: సీఎం కేసీఆర్ సారథ్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు జరిగాయి. ఇందులో బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్‌ను ఎమ్మెల్సీ చేయాలనే నిర్ణయం జరిగినట్టు తెలిసింది. దీంతో ఖైరతాబాద్‌లో బీఆర్ఎస్ నేతల మధ్య పోటీ చల్లబడినట్టయింది. దాసోజు శ్రవణ్ ఎమ్మెల్సీ కానుండటంతో సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు లైన్ క్లియర్ అయింది. 

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి బీఆర్ఎస్ నుంచి దానం నాగేందర్, కాంగ్రెస్ నుంచి దాసోజు శ్రవణ్ పోటీ పడ్డారు. దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే, ఆ తర్వాత దాసోజు శ్రవణ్ కూడా కాంగ్రెస్ వీడి బీఆర్ఎస్‌లో చేరారు. దీంతో ఖైరతాబాద్ టికెట్ గురించి బీఆర్ఎస్‌లో ఈ ఇద్దరి మధ్య పోటీ నెలకొంది. ఈ సారి ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ టికెట్ నాకంటే నాకు అన్నట్టుగా వీరి మధ్య పోటీ నెలకొంది.

Latest Videos

ఇటీవలే వరద ముంపు బాధితులను పరామర్శిస్తూ దానం నాగేందర్ కచ్చితంగా ఈ సారి మళ్లీ టికెట్ తనకేనని చెప్పుకొచ్చారు. ఈ విషయం సీఎం కేసీఆర్‌కు కూడా తెలుసని పేర్కొన్నారు.

Also Read: నాతో చెప్పించుకోవడం సిగ్గుచేటు.. కేసీఆర్ ఎవరి దగ్గర శిష్యరికం చేశాడు?: రఘునందన్ రావు విమర్శలు

సీఎం కేసీఆర్ ఇది వరకే సిట్టింగ్‌లకు భరోసా ఇచ్చిన సంగతి తెలిసిందే. 99 శాతం టికెట్లు సిట్టింగ్‌లకే ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే, ఆ తర్వాత ఓ ఝలక్ కూడా ఇచ్చారు. దళిత బంధు పథకం అమల్లో కొందరు ఎమ్మెల్యేలు కమీషన్లు కక్కుర్తి పడుతున్నట్టు తనకు సమాచారం అందిందని చెబుతూ.. సుమారు 40 మంది ఎమ్మెల్యేలు తమ పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు కూడా.

తెలంగాణ కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి కేటీఆర్  సోమవారంనాడు రాత్రి మీడియాకు వివరించారు.  ఎస్టీ సామాజిక వర్గం నుండి  కుర్రా సత్యనారాయణకు, బీసీ సామాజిక వర్గం నుండి  దాసోజు శ్రవణ్ కుమార్ పేర్లను  గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ పదవులకు  కేబినెట్ సమావేశం  తీర్మానం చేసిందని మంత్రి కేటీఆర్ చెప్పారు.

click me!