Cyclone Gulab: తెలంగాణకు పొంచివున్న ముప్పు... మరో 48గంటలు భారీ నుండి అతిభారీ వర్షాలు

By Arun Kumar PFirst Published Sep 27, 2021, 12:29 PM IST
Highlights

గులాబ్ తుఫాన్ కారణంగా తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తుండగా మరో 48గంటలపాటు ఇవి కొనసాగే అవకాశం వుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాను (Cyclone Gulab) ప్రభావంతో తెలుగురాష్ట్రాలో భారీ వర్షాలు (Heavy Rains in Telangana) కురుస్తున్నాయి. గత రెండురోజులుగా తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు మరో రెండురోజుల పాటు కొనసాగే అవకాశం వుందని వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా రానున్న 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని... ప్రజలు, అధికారులు అప్రమత్తంగా వుండాలని హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాలు, జలాశయాల సమీపంలో నివాసముండే ప్రజలు మరింత అప్రమత్తంగా వుండాలని సూచించారు. 

తెలంగాణ భారీ వర్షాలు కురిసే అవకాశముందన్న హెచ్చరికల నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని టీఎస్‌ ఎన్‌పీడీసీఎల్‌ సీఎండీ అన్నమనేని గోపాల్‌రావు ఆదేశించారు. వర్షాల కారణంగా బాగా తడిసిపోయి విద్యుత్ స్తంబాల్లో కరెంట్ ప్రవహించే అవకాశం వుంటుంది కాబట్టి ప్రజలు వాటికి దూరంగా ఉండాలని సూచించారు.  విద్యుత్‌ వైర్లు తెగినా, స్తంబాలు కూలిపోయినా ఇలా విద్యుత్ శాఖకు సంబంధించిన ఇతర సమస్యలపై సర్కిల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూమ్‌ లేదా టోల్‌ఫ్రీ నంబర్లకు ఫోన్‌ చేసి తెలపాలని సూచించారు. కంట్రోల్‌ రూం నంబరు 18004250028, టోల్‌ఫ్రీ నంబరు 1912 అని తెలిపారు.

తుఫాను కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షపు నీటితో బాగా తడిసి మహబూబాబాద్ లోని ప్రభుత్వాస్పత్రిలో పైకప్పు పెచ్చులూడింది. అయితే ఈ సమయంలో పేషెంట్స్, వైద్య సిబ్బంది ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఇక తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశమున్న ఒక జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్,  ఏడు జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు.  

read more  ఉద్ధృతంగా మంజీరా నది: జలదిగ్బంధంలో ఏడుపాయల వన దుర్గా భవాని ఆలయం

తెలంగాణ రాజధాని హైదరాబాదులో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం తెల్లవారుజాము నుంచే కుండపోతగా వర్షం కురుస్తోంది. మరో రెండు రోజుల పాటు హైదరాబాదులో వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అధికారుల హెచ్చరిక నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాదు నగర పాలక సంస్థ (జిహెచ్ఎంసీ) ప్రజలను అప్రమత్తం చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కూకట్ పల్లి, అమీర్ పేట, దిల్ షుక్ నగర్ తదితర ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. జిహెచ్ఎంసీ హై అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాల కారణంగా జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలో జరగాల్సిన సప్లిమెంటరీ పరీక్షలన్నీ వాయిదా పడ్డాయి.

 భారీ వర్షాలతో హైదరాబాదు రోడ్లున్నీ జలమయం అయ్యాయి. వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాదులో జిహెచ్ఎంసీ కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది. అత్యవసర పరిస్థితుల్లో 040-23202813 నెంబర్ కు ఫిర్యాదు చేయాలని జిహెచ్ఎంసీ సూచించింది.

రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు ఉద్రుతంగా ప్రవహిస్తూ రహదారులను ముంచేసాయి. దీంతో పలు ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. జలాశయాలు, చెరువులు కూడా వరద నీటితో నిండుకుండలా మారాయి. 

 

click me!