పొలం వద్ద కరెంట్ షాక్ తగిలి తండ్రీకొడుకు అక్కడికక్కడే మృతి చెందిన దారుణ ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామాలో ఆదివారం చోటు చేసుకుంది.
పొలం గట్టుపై తెగిపడిన విద్యుత్ తీగను తాకి తండ్రి మృతిచెందగా.. ఆయన్ను వెతుకుతూ వెళ్లిన కొడుకూ అదే తీగకు తగిలి దుర్మరణం చెందాడు. అతని వెంట వెళ్లిన పెంపుడు శునకమూ మృత్యువాతపడింది. ఈ విషాదకర ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామలో ఆదివారం జరిగింది.
పోలీసులు. స్థానికుల కథనం ప్రకారం జాలిగామా గ్రామానికి చెందిన కుమ్మరి కనకయ్య(56)కు భార్య, ముగ్గురు కుమారులున్నారు. తెల్లవారుజామున 5 గంటలకు తన వరి పొలంలో నీరు చూసేందుకు వెళ్లారు. అయితే.. పొలం గట్టుపై కరెంట్ తీగలు తెగిపడటం గమనించకుండా తాకడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందారు. తండ్రి ఎంతకూ ఇంటికి రాకపోవడంతో కనకయ్య ఇద్దరు కొడుకులు కలిసి వెంటనే పొలానికి వెళ్లారు. చెరో గట్టు పైనుంచి వెతుకుతూ వెళ్లారు.
undefined
ఈ క్రమంలో పెద్ద కొడుకు భాస్కర్ (28) కాళ్లకూ అదే తీగ తగిలి అక్కడికక్కడే మృతిచెందారు. భాస్కర్ వెంట వెళ్లిన శునకం కూడా ఆయన్ను తాకడంతో చనిపోయింది. భాస్కర్ అరుపు విన్న తమ్ముడు కరుణాకర్ అనుమానంతో ట్రాన్స్ ఫార్మర్ ను ఆఫ్ చేయించి.. వెళ్లి చూడగా శునకంతో సహా కనకయ్య, భాస్కర్ మృతి చెంది ఉన్నారు.
తీగలు చాలా రోజుల కిందట బిగించినవి కావడంతో తెగి ఉంటాయని ప్రాథమికంగా అంచనా వేస్తున్నట్లు గజ్వేల్ విద్యుత్‌శాఖ డీఈ జగదీశ్ ఆర్య తెలిపారు. గజ్వేల్ సీఐ జాన్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. భాస్కర్ కు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు.