
హైదరాబాద్ : తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రెరా బాధ్యతలను తాత్కాలికంగా సిఎస్ శాంతికుమారికి తెలంగాణ ప్రభుత్వం అప్పగించింది. రెరా శాశ్వత అథారిటీ ఏర్పాటు అయ్యేదాకా ఈ బాధ్యతలను సిఎస్ శాంతి కుమారి చూస్తారని తెలిపారు. శుక్రవారం నాడు తెలంగాణ రియల్ ఎస్టేట్ (నియమావళి అభివృద్ధి) చట్టం 2016ను అనుసరించి ఈ మేరకు శాంతి కుమారికి బాధ్యతలు అప్పగిస్తూ పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్ నోటిఫికేషన్ జారీ చేశారు.
శాశ్వత అథారిటీ ఏర్పాటులో భాగంగా చైర్మన్, ఇద్దరు సభ్యుల నియామకం కోసం నోటిఫికేషన్లు జారీ చేసి దరఖాస్తులను కూడా స్వీకరించిన విషయం తెలిసిందే. కాగా, అంతకు ముందు తెలంగాణ నుంచి ఏపీకి బదిలీ అయిన మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ కు ఈ బాధ్యతలు అప్పగించనున్నట్లుగా ఊహాగానాలు వెలువడ్డాయి. ఆయన ఈ పదవిని ఆశిస్తున్నట్లుగా గుసగుసలు వినిపించాయి.
ఎమ్మెల్యే ఫాంహౌస్ లో బిల్డింగ్ మీదినుంచి జారిపడి ఒకరు, గుండెపోటు మరొకరు మృతి...
ఇదిలా ఉండగా, సిఎస్ శాంతి కుమారి మీద రాష్ట్ర గవర్నర్ తమిలిసై సౌందర్య రాజన్ ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ దగ్గర పెండింగ్ లో ఉన్న బిల్లుల విషయంపై సుప్రీంకోర్టులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్చి రెండో తేదీన రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఆ మరుసటి రోజు మార్చి మూడవ తేదీన గవర్నర్ తమిళసై సిఎస్ఐ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రస్తుత సిఎస్ శాంతి కుమారి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. కనీస మర్యాదలు పాటించలేదని విమర్శించారు.
ఆమె రాజ్ భవన్ కు రాలేదని, కనీస మర్యాద కోసమైనా ఫోన్లో మాట్లాడలేదని అన్నారు. కూర్చుని మాట్లాడుకుని.. చర్చించుకుంటే అన్ని సమస్యలు పరిష్కారం జరుగుతుందని.. కానీ, పరిష్కారం అవసరం లేనట్టుగా కనిపిస్తుందని గవర్నర్ అభిప్రాయపడ్డారు. అంతేకాదు ఢిల్లీ కంటే రాజ్ భవన్ దగ్గర అనే విషయాన్ని మరోసారి గుర్తు చేస్తున్నా అని ఆమె ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.