కాంగ్రెస్ పార్టీ తమ ప్రతిపాదనలకు అంగీకరిస్తేనే రానున్న రోజుల్లో తమ మధ్య చర్చలు మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉందని సీపీఐ తెలంగాణ రాష్ట్ర సమితి కార్యదర్శి కూనంనేని సాంబశివరావు చెప్పారు.
హైదరాబాద్: తమ పార్టీ ప్రతిపాదనలకు కాంగ్రెస్ అంగీకరిస్తే రానున్న రోజుల్లో చర్చలు ముందుకు సాగుతాయని సీపీఐ తెలంగాణ రాష్ట్ర సమితి కార్యదర్శి కూనంనేని సాంబశివరావు చెప్పారు.
ఆదివారంనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రేతో కూనంనేని సాంబశివరావు సమావేశమయ్యారు.ఈ సమావేశం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ ప్రతిపాదనలను కాంగ్రెస్ వద్ద ప్రస్తావించామన్నారు. చర్చలు ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉన్నాయన్నారు. తమ పార్టీ ఎన్ని సీట్లు పోటీ చేస్తుందనే విషయాలను తమ ప్రతిపాదనను కాంగ్రెస్ అంగీకరిస్తే ఆ తర్వాత చర్చల్లో వివరిస్తామన్నారు.
తమ ప్రతిపాదనలపై కాంగ్రెస్ పార్టీ వైఖరి ముందు తేలాల్సిన అవసరం ఉందన్నారు. సీపీఎం కూడ కాంగ్రెస్ పార్టీతో చర్చలు చేసే అవకాశం ఉందన్నారు. కాంగ్రెస్ నేతలు ఆ పార్టీతో కూడ చర్చించే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదనలపై ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలిసి చర్చించిన తర్వాత నిర్ణయాన్ని ప్రకటించనున్నట్టుగా కూనంనేని సాంబశివరావు ప్రకటించారు.
మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు మద్దతు ప్రకటించాయి. అయితే వచ్చే అసెంబ్లీ,పార్లమెంట్ ఎన్నికల్లో కూడ ఈ పొత్తు కొనసాగుతుందని కేసీఆర్ ప్రకటించారు. అయితే ఈ నెల 21న బీఆర్ఎస్ 115 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులు ప్రకటించింది. ఈ పరిణామం ఉభయ కమ్యూనిస్టు పార్టీలను షాక్ కు గురి చేసింది. దీంతో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు సమావేశాలు నిర్వహించాయి. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. ఇవాళ సీపీఎం రాష్ట్ర కమిటీ భేటీ అయింది. బీఆర్ఎస్ తొలి జాబితాతో పాటు వచ్చే ఎన్నికల్లో ఏ రకమైన వ్యూహంతో వెళ్లాలనే దానిపై చర్చించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నుండి కూడ ఉభయ కమ్యూనిస్టులతో సంప్రదింపులు ప్రారంభమయ్యాయి.
also read:బీఆర్ఎస్, లెఫ్ట్ మధ్య పొత్తుకు బ్రేక్:కొత్త పొడుపులు పొడిచేనా?
తొలుత సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో కాంగ్రెస్ నేతలు చర్చించారు. సీపీఎం రాష్ట్ర నేతలతో కూడ కాంగ్రెస్ పార్టీ నేతలు సమావేశమయ్యే అవకాశం లేకపోలేదు. అయితే పొత్తులపై తొందరపడాల్సిన అవసరం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశం తర్వాత తమ్మినేని వీరభద్రం మీడియాతో ఈ వ్యాఖ్యలు చేశారు.