దేశంలో పేదలు తిండిలేక అల్లాడుతుంటే.. కుబేరుల లిస్ట్‌లో మోడీ శిష్యులు : సీపీఐ నేత పల్లా వెంకట్ రెడ్డి

By Siva KodatiFirst Published Aug 20, 2022, 4:16 PM IST
Highlights

కరోనా సమయంలో పేదలు తినడానికి తిండిలేక ఇబ్బందులు పడుతున్నారని సీపీఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి అన్నారు. కానీ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల లిస్టులో అంబానీ, అదానీలు చోటు దక్కించుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. 

సీపీఐ మద్ధతుతోనే గతంలో మునుగోడు ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలిచారని అన్నారు ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి. శనివారం మునుగోడులో జరిగిన టీఆర్ఎస్ ప్రజా దీవెన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... గడిచిన మూడేళ్లుగా ప్రజా సమస్యలను కోమటిరెడ్డి గాలికొదిలేశారని దుయ్యబట్టారు. ఈనాడు బీజేపీ వైపు వడివడిగా అడుగులు వేసుకుంటూ వెళ్తున్నారని పల్లా వెంకట్ రెడ్డి దుయ్యబట్టారు. ఈ నియోజకవర్గంలో సమస్యలేంటీ, వాటిని ఎలా పరిష్కరించాలనే దానిపై రాజగోపాల్ రెడ్డి ఒక్కసారి కూడా తమతో చర్చించలేదని పల్లా ఎద్దేవా చేశారు. 

రాజగోపాల్ రెడ్డి చేరాలనుకుంటోన్న భారతీయ జనతా పార్టీ .. దేశాన్ని ఏ వైపు నడిపిస్తోందో ప్రజలు గమనించాలని ఆయన అన్నారు. ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని పల్లా వెంకట్ రెడ్డి ఆరోపించారు. కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ ప్రభుత్వం మతోన్మాదంతో పేద ప్రజల గురించి ఆలోచించకుండా , కార్పోరేట్ రంగాన్ని పరిపుష్టం చేయాలని యోచిస్తోందని ఆయన మండిపడ్డారు. కరోనా సమయంలో పేదలు తినడానికి తిండిలేక ఇబ్బందులు పడుతున్నారని.. కానీ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల లిస్టులో అంబానీ, అదానీలు చోటు దక్కించుకున్నారని ఇదంతా బీజేపీ విధానాల వల్లేనని పల్లా వెంకట్ రెడ్డి అన్నారు. 

వారి శాశ్వత ఎజెండా మతోన్మాద ఎజెండా అన్నారు. దీనిపై సీపీఐ జాతీయ, రాష్ట్ర నాయకులతో కేసీఆర్ ఏనాడో చర్చించారని పల్లా వెంకట్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాల్సిన బాధ్యత కమ్యూనిస్ట్ పార్టీలదేనని కేసీఆర్ చెప్పారని ఆయన వెల్లడించారు. స్వతంత్రంగా వుండాల్సిన సంస్థలను బీజేపీ తమ చెప్పుచేతల్లో పెట్టుకుని ప్రజల్లో ఆ పార్టీకి సానుభూతి లేకున్నా.. పరిపాలన సాగిస్తోందని మండిపడ్డారు. మేధావులకు, కమ్యూనిస్ట్‌లకు మతోన్మాద బీజేపీ పార్టీ ప్రథమ శత్రువుని వెంకట్ రెడ్డి అన్నారు. 

click me!