
ఉద్యమ సమయంలో తెలంగాణ వ్యతిరేక పార్టీగా పేరుపడ్డ సీపీఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బొక్కబోర్లా పడింది.
2014 ఎన్నికల తర్వాత దాదాపు తుడిచిపెట్టుకపోయినంత పనైంది. అయితే పార్టీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం టీఆర్ఎస్ సర్కారు రెండున్నరేళ్ల పాలనపై విమర్శలు ఎక్కుపెడుతూ సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.
2016 అక్టోబరు 17న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం లో మహాజన పాదయాత్ర పేరుతో ఓ పోరాట కార్యక్రమాన్ని మొదలు పెట్టారు.
రాష్ట్రంలోని కార్మికులు, కర్షకులు, స్కీం వర్కర్లు, విద్యార్థులు, మహిళలు, నిరుద్యోగ యువకులు, పెన్షనర్లు, ఉద్యోగులు, సిబ్బంది సమస్యలను తెలుసుకునేందుకు ఊరువాడా సభలు సమావేశాలు నిర్వహించారు.
తమ్మినేని పాదయాత్రకు కమ్యూనిస్టు కార్యకర్తలు పూర్తిస్థాయిలో సహకారం అందించారు. ఆయన యాత్ర రాష్ట్రంలో గద్వాల, సిరిసిల్ల తప్ప 29 జిల్లాల్లో పూర్తి స్థాయిలో కొనసాగింది. 154 రోజుల పాటు తమ్మినేని బృందం 1500 గ్రామాల్లో, 4,150 కిలోమీటర్లు పర్యటించింది.
ఈ యాత్రను పురస్కరించుకొని నిన్న హైదరాబాద్ లో భారీ బహిరంగ సభను కూడా నిర్వహించారు. సీపీఎం అగ్రనేతలు సహా, కమ్యూనిస్టులు దీనికి వేలాదిగా తరలివచ్చారు.
రాష్ట్ర నేతలంతా టీఆర్ఎస్ సర్కారుపై, సీఎం కేసీఆర్ వ్యవహార శైలిపై ఈ సభలో తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సభకు వచ్చిన కార్యకర్తలు ఆ విమర్శలకు చప్పట్లతో మద్దతుతెలిపారు.
24 గంటలు గడిచాయో లేదు సీన్ రివర్స్ అయింది. పాదయాత్రతో పార్టీ బలోపేతం అయిందని తమ్మినేని బృందం సంబరాలు చేసుకుంటున్న వేళ కమ్యూనిస్టు కార్యకర్తలు వారికి భారీ షాక్ ఇచ్చారు.
ఈ రోజు మంత్రి కేటీఆర్ సమక్షంలో వరంగల్ జిల్లాకు చెందిన దాదాపు 10 వేల మంది సీపీఎం కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరారు. ప్రభుత్వ పనితీరుకు ఆకర్షితులమై స్వచ్ఛందంగా గులాబీ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.
సీపీఎంకు బాగా బలమున్న వరంగల్ లోనే దాదాపు 10 వేలమంది కమ్యూనిస్టులు టీఆర్ఎస్ లోకి జంప్ కావడంతో జిల్లాలో పార్టీ దాదాపు ఖాళీ అయినట్లైంది. అంతేనా మరికొన్ని జిల్లాల్లో కూడా సీపీఎం నుంచి భారీ స్థాయిలో టీఆర్ఎస్ కు చేరికలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది.
పార్టీ బలోపేతానికి తమ్మినేని పాదయాత్ర జరిపితే కమ్యూనిస్టు కార్యకర్తలు మాత్రం ‘కారు‘యాత్రకు సిద్దమైపోతున్నారు.