తెలంగాణలో గుద్దులాట-ఢిల్లీలో ముద్దులాట... బిజెపి, టీఆర్ఎస్ డబుల్ గేమ్: సిపిఐ నారాయణ

By Arun Kumar PFirst Published Sep 8, 2021, 5:09 PM IST
Highlights

సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం విషయంలో టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం కు బయపడితేే బిజెపి మతం రంగు పులమడానికి ప్రయత్నిస్తోందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. 

హైదరాబాద్: సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం జరపడం అటు కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీకి, ఇటు రాష్ట్రంలో అధికారంలో వున్న టీఆర్ఎస్ కు ఏ మాత్రం ఇష్టం లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. కావాలంటే ఈ విషయమై ఇరు పార్టీల నాయకులకు నార్కోటిక్ టెస్టులు చేయాలని... అప్పుడు అసలు నిజం బయటపడుతుందని అన్నారు. 

''గతంలో విద్యాసాగర్ రావు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పుడు సాయుధ పోరాట యోధులకు పెన్షన్ ఇవ్వమన్నారు. కానీ ఇప్పటివరకు అది అమలుకాలేదు. ఇప్పటికైనా సాయుధ పోరాట యోధులకు పెన్షన్ ఇవ్వాలి'' అని నారాయణ డిమాండ్ చేశారు. 

''టీఆర్ఎస్ , బీజేపీలది తెలంగాణలో గుద్దులాట. ఢిల్లీలో ముద్దులాట. ఈ రెండు పార్టీలు ఒక్కటే. అలా కాదని భావించాలంటే మోదీ పాలనకు వ్యతిరేకంగా ఈనెల 27న జరిగే భారత్ బంధు లో టీఆర్ఎస్ పాల్గొనాలి'' అని నారాయణ డిమాండ్ చేశారు. 

read more  రాహుల్‌తో రేవంత్ రెడ్డి భేటీ: తెలంగాణలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ

ఇక తెలంగాణ రాష్ట్ర సిపిఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ... బీజేపీ, టీఆర్ఎస్ లు డబుల్ గేమ్ ఆడుతున్నాయని అన్నారు. తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టేది ప్రజా సంగ్రామ యాత్ర కాదు..  ప్రజా దగా యాత్ర అని‌ విమర్శించారు. బండి చేస్తున్న పాదయాత్రలో పస లేదని... ఆయనను ప్రజలు గుర్తించటం‌ లేదన్నారు. 

''తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవాన్ని కేంద్రం గుర్తించిన తర్వాతనే అమిత్ షా తెలంగాణలో పర్యటించాలి. అలాగే తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న వారికి కేసీఆర్ ప్రభుత్వం పెన్షన్ ఇవ్వాలి'' అని చాడ డిమాండ్ చేశారు. 

''బీజేపీతో సీఎం కేసీఆర్ తెలంగాణ గల్లీల్లో కుస్తీ పట్టినట్లు నమ్మిస్తూ ఢిల్లీలో దోస్తీ చేస్తున్నారు. ఇక ఎంఐఎంతో దోస్తీ కారణంగా కేసీఆర్ సెప్టెంబరు17ను అధికారికంగా నిర్వహించటం లేదు. మరోవైపు తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవానికి బీజేపీ మతం రంగు పులుముతోంది. కాబట్టి తెలంగాణ సీపీఐ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 11నుంచి 17వరకు సాయుధ అమరులకు నివాళి కార్యక్రమాలు చేపడుతున్నాం'' అని చాడ వెంకటరెడ్డి ప్రకటించారు. 
 

click me!