
హైదరాబాద్: భూమి తన పేరిట రిజిస్టర్ చేయించాలని(Land Dispute) ఓ వ్యక్తి మరో కుటుంబ పెద్దపై వేధింపులకు పాల్పడ్డారు. ఆ పెద్ద మరణించిన తర్వాత ఆయన కొడుకునూ బెదిరించాడు. ఆయన తన దారికి రావడం లేదని ఏకంగా హత్య చేయాలని ప్లాన్ వేశాడు. ఓ రోజు రాత్రి అందరూ పడుకున్న సమయంలో పెట్రోల్ చేతిలో పట్టుకుని ఆ ఇంట్లోకి దూరాడు. ఇంటిపై పెట్రోల్ పోశాడు. నిప్పంటించాడు. అది గమనించి వారు బయటకు రావడంతో వారిపైనా పెట్రోల్(Petrol) పోశాడు. ఈ కేసును విచారించిన కోర్టు ఈ రోజు నాగరాజును దోషిగా తేల్చి నాలుగేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ ఘటన రాచకొండ(Rachakonda) కమిషనరేట్ పరిధిలోని రాజాపేట మండలం రఘునాథపుర్ గ్రామంలో చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం, రాజాపేట్ మండలం రఘునాథపుర్ గ్రామానికి చెందిన పల్లె నర్సింహులు తండ్రి బాలయ్యను అదే గ్రామానికి చెందిన పొరుగున ఉండే వడ్లకొండ నాగరాజు కొన్నాళ్లు బెదిరించాడు. వడ్లకొండ నాగరాజు తరుచూ మద్యం తాగేవాడు. ఆ మత్తులోనే బాలయ్య దగ్గరకు వచ్చి ఆయన భూమిని తన పేరిట రిజిస్టర్ చేయాలని గొడవ పెట్టుకునేవాడు. ఈ ఘర్షణలు చాలా సార్లు జరిగాయి. 2016లో నాగరాజు తండ్రి అనారోగ్యంతో మరణించాడు. ఆ తర్వాత ఒక రోజు నాగరాజు తప్ప తాగి తన తల్లితో గొడవ పెట్టుకున్నాడు. ఈ ఘర్షణల కేకలు వినిపించి నర్సింహులు వాళ్ల ఇంటికి వెళ్లాడు. తాగి తల్లితో గొడవ పెట్టుకుంటుండం చూసి నర్సింహులు.. నాగరాజును కొట్టాడు. అప్పటి నుంచి నర్సింహులుపై నాగరాజు కక్ష పెంచుకున్నాడు.
తరుచూ నర్సింహులుతో నాగరాజు ఘర్షించేవాడు. చివరకు నర్సింహులును హతమార్చాలని పథకం రచించాడు. నర్సింహులును చంపడానికి నాగరాజు మూడు లీటర్ల పెట్రోల్ ముందే కొని తెచ్చుకున్నాడు. తన ఇంటిలో పెట్టుకున్నాడు. గతేడాది మే నెల 10వ తేదీన నాగరాజు మద్యం తాగాడు. అదే రోజు రాత్రి భోజనం చేసిన తర్వాత నర్సింహులు కుటుంబం ఇంటి వరండాలో పడుకున్నారు. రాత్రి 3 గంటల ప్రాంతంలో నాగరాజు ఇంట్లోకి కంపౌండ్ వాల్ దూకి పెట్రోల్ బాటిళ్లతో అక్రమంగా వెళ్లాడు. బయటి నుంచి ఓ డోర్‌ను తీసే ప్రయత్నం చేశాడు. ఇది విని నర్సింహులు, ఆయన భార్య లక్ష్మీ మేలుకున్నారు. ఇంట్లోకి ఎందుకు వచ్చావ్ అని అడగ్గా.. వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను నాగరాజు ఇంటి కిటికీలపై, నర్సింహులుపై పోశాడు. అగ్గి పుల్ల అంటిబెట్టి మీద వేశాడు. ఆ మంటలతో నర్సింహులు, ఆయన భార్య లక్ష్మీ కేకలు వేశారు. ఈ చప్పుళ్లతో మేలుకున్న కొడుకు వెంటనే కిచెన్ డోర్ తీసి మంటలు ఆర్పే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో ఆ నాగరాజు నర్సింహులు కొడుకుపైనా పెట్రోల్ చల్లాడు. అక్కడి నుంచి పారిపోయాడు.
ఈ ఫిర్యాదుతో రాజాపేట్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు సాక్ష్యాధారాలు సేకరించారు. నిందితుడు నాగరాజును అరెస్టు చేశారు. జ్యూడీషియల్ కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసులో దర్యాప్తు పూర్తి చేశారు. ఈ కేసులో భోనగిరి ఏఎస్‌జే కోర్టు తీర్పు వెలువరించింది. నాగరాజుకు నాలుగేళ్ల కఠిన జైలు శిక్ష విధించింది. రూ. 2000 జరిమానా విధించినట్టు రాచకొండ పోలీసు స్టేషన్ ఓ ప్రకటనలో పేర్కొంది.