కేసీఆర్.. నేనూ సీఎంనే, బీజేపీ అంటే బిర్యానీ అనుకున్నారా: శివరాజ్ సింగ్ చౌహాన్

By Siva KodatiFirst Published Jan 7, 2022, 8:18 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై (kcr) విరుచుకుపడ్డారు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. కేసీఆర్ (kcr) పిరికివాడని ఇలాంటి సీఎంను తానెక్కడా చూడలేదన్నారు. తెలంగాణ ప్రజల పక్షాన పోరాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని (bandi sanjay) చౌహాన్ అభినందించారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై (kcr) విరుచుకుపడ్డారు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ (shivraj singh chouhan) . శుక్రవారం హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ (bjp) కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ (kcr) పిరికివాడని ఇలాంటి సీఎంను తానెక్కడా చూడలేదన్నారు. తెలంగాణ ప్రజల పక్షాన పోరాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని (bandi sanjay) చౌహాన్ అభినందించారు. విపక్షాలు లేవనెత్తే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందన్నారు. కానీ తెలంగాణలో ఆ పరిస్థితి కనిపించడం శివరాజ్ సింగ్ దుయ్యబట్టారు. ఉద్యమిస్తే భయపడి అక్రమంగా, దౌర్జన్యంగా అరెస్టు చేసి జైల్లో వేస్తున్నారని .. బీజేపీ చేస్తున్న పోరాటానికి మద్దతివ్వడానికే తెలంగాణ గడ్డపైకి వచ్చినట్లు ఆయన చెప్పారు.  

మీ బెదిరింపులకు బీజేపీ భయపడదని... కేసీఆర్‌కు కలలో కూడా బండి సంజయ్‌ గుర్తొస్తున్నారంటూ చౌహన్ చురకలు వేశారు. రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తోందని.. కేసీఆర్ నేను కూడా సీఎంనే, నువ్వు రెండోసారి సీఎం కావొచ్చు... నేను నాలుగోసారి సీఎంనంటూ సెటైర్లు వేశారు. బీజేపీ అంటే బిర్యానీ అనుకున్నారా? డబుల్ బెడ్‌ రూం ఇళ్లు, నిరుద్యోగ భృతి, కేజీ టు పీజీ ఉచిత విద్య ఏమైంది? వీటికి జవాబు ఎందుకు ఇవ్వడం లేదని శివరాజ్ సింగ్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ధర్మయుద్దం మొదలైందని.. అవినీతి-నియంత-కుటుంబ పాలనను అంతం చేసేందుకు సంజయ్ చేస్తున్న పోరాటం అభినందనీయమన్నారు.  2023లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చి తీరుతుందని శివరాజ్ సింగ్ చౌహాన్  జోస్యం చెప్పారు.

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ.. 317 జీవోపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పందించే వరకు బీజేపీ పోరాటం చేస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాకే ఈ ఉత్తర్వును రద్దు చేస్తామన్నామని సంజయ్ పేర్కొన్నారు. ఉద్యోగులు మరో 2 సంవత్సరాలు ఓపిక పట్టాలని.. బీజేపీ చేస్తోన్న పోరాటానికి ఉద్యోగులు, ఉపాధ్యాయులు మద్దతివ్వాలని ఆయన కోరారు. నలుగురి ఆత్మహత్యకు టీఆర్ఎస్ నేత కారణమయ్యాడని.. అలాంటి కామాంధుడిపై సీఎం కేసీఆర్‌ ఎలాంటి చర్యలు తీసుకోలేదని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కామాంధుడికి శిక్ష పడాలని అన్ని సంఘాలు కోరుతున్నాయని... పాల్వంచ ఘటనపై సీఎం స్పందించకపోవడమంటే.. ఆ ఘటనను సమర్థించడమే అవుతుందని చురకలు వేశారు. నిందితుడిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. గతంలోనే నిందితుడిపై చర్యలు తీసుకొని ఉంటే ఇలాంటి ఘటన జరిగేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.     

ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ (lakshman) మాట్లాడుతూ.. టీఆర్ఎస్ అవినీతి, నియంతృత్వ పాలనను తరిమికొట్టే వరకు విశ్రమించేది లేదని  స్పష్టం చేశారు. అరెస్టుల వల్ల బీజేపీ కార్యకర్తలు భయపడరనే విషయాన్ని గ్రహించాలన్నారు. రాజకీయ పోరాటం కొనసాగిస్తామని చెప్పడానికే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ హైదరాబాద్‌ వచ్చినట్లు చెప్పారు. ఎల్లుండి అస్సాం ముఖ్యమంత్రి వరంగల్‌ వస్తున్నారని..   317 జీవో సవరణ పోరాటంలో పాల్గొంటారని లక్ష్మణ్ వెల్లడించారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని ఆయన తేల్చి చెప్పారు. మంత్రి కేటీఆర్ బీజేపీ నాయకులపై దిగజారి మాట్లాడుతున్నారని లక్ష్మణ్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాషాయ జెండా ఎగరడం ఖాయమని లక్ష్మణ్‌ జోస్యం చెప్పారు.

click me!