ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదు... కరీంనగర్ పోలీసులకు కోర్టు ఆదేశం

By Arun Kumar PFirst Published Jul 21, 2021, 2:43 PM IST
Highlights

ఇటీవలే తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకులాల మాజీ కార్యదర్శి పదవికి రాజీనామా చేసిన మాజీ ఐపిఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ పై పోలీస్ కేసు నమోదు చేయాల్సిందిగా కోర్టు ఆదేశాలు వెలువడ్డాయి. 

కరీంనగర్: మాజీ ఐపిఎస్ అధికారి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదు చేయాలని పోలీసులకు కరీంనగర్ కోర్టు ఆదేశించింది. హిందు దేవతలను కించపర్చేలా ప్రవీణ్ కుమార్ ప్రతిజ్ఞ చేశారంటూ న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి పోలీసులకు పిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఈ పిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ప్రిన్సిపాల్ జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ సాయిసుధ మాజీ ఐపిఎస్ పై కేసు నమోదు చేయాల్సిందిగా కరీంనగర్ త్రీ టౌన్ పోలీసులను ఆదేశించారు. 

ఈ ఏడాది మార్చిలో పెద్దపల్లి జిల్లా జులపెల్లి మండలం వడుకపూర్(ధూళికట్ట) గ్రామంలో స్వేరోస్ భీమ్ దీక్ష కార్యక్రమంలో ఆర్. ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంలో స్వేరో సభ్యులతో కలిసి హిందు దేవుళ్లు రాముని, కృష్ణుని మీద నమ్మకం లేదని... వాళ్ళను పూజించనని ప్రతిజ్ఞ చేశారు. అలాగే గౌరీ మీద, గణపతి మీద ఇతర హిందు దేవతల ఎవరి మీద నమ్మకం లేదని... శ్రాద్ధా కర్మలు పాటించనని, పిండదానాలు చేయబోమని, హిందు విశ్వాసాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారని మహేందర్ రెడ్డి తెలిపారు. ఇలా స్వేరోస్ సభ్యులందరు ఎడమ చేతిని చాచి ప్రతిజ్ఞ చేస్తుంటే వారితో పాటు ఆర్. ఎస్. ప్రవీణ్ కుమార్ కూడా ప్రతిజ్ఞ చేయగా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

read more  ప్రవీణ్ కుమార్ వీఆర్‌ఎస్‌కు తెలంగాణ సర్కార్ ఆమోదముద్ర.. విధుల నుంచి రిలీవ్

ఇలా ప్రవీణ్ కుమార్ తన మత విశ్వాసాలను దెబ్బతీశారని, రెండు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడమే కాదు హిందు దేవుళ్లను ఆవమానించేలా ప్రతిజ్ఞ చేసిన వీడియోను, పత్రికలో వచ్చిన వార్తను సేకరించి ఆధారాలతో సహా కరీంనగర్ మూడవ పట్టణ పోలీసు స్టేషన్లో న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మహేందర్ రెడ్డి కోర్టును ఆశ్రయించి పిటిషన్ దాఖలు దాఖలుచేశారు. ఆధారాలను, పూర్వపరాలను పరిశీలించిన తరువాత ఆర్. ఎస్ ప్రవీణ్ కుమార్, న్యాతరి శంకర్ బాబు లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని న్యాయమూర్తి సాయిసుధ ఆదేశాలు జారీ చేశారని మహేందర్ రెడ్డి తెలిపారు. 

ఇప్పటికైనా ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ పై వెంటనే  కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని మహేందర్ రెడ్డి పోలీసులను, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హిందువులను, దేవుళ్లను, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడేవారు ఎంతటివారైన విడిచిపెట్టేదిలేదని మహేందర్ రెడ్డి హెచ్చరించారు.  

click me!