కాగ్నా నది దాటుతూ.. వరదకు కొట్టుకుపోయిన దంపతులు...

Published : Jul 28, 2022, 08:53 AM IST
కాగ్నా నది దాటుతూ.. వరదకు కొట్టుకుపోయిన దంపతులు...

సారాంశం

హైదరాబాద్ లో భారీగా కురుస్తున్న వర్షాలకు పొంగిన వరదల్లో ఓ భార్యాభర్తలు కొట్టుకుపోయారు. వికారాబాద్ లోని కాగ్నా నది దాటుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. 

వికారాబాద్ : కూరగాయలు అమ్మి తిరిగి వస్తుండగా భార్యాభర్తలు కాగ్నా నది దాటుతూ వరదలో కొట్టుకుపోయారు. మూడు రోజుల తరువాత కర్ణాటకలోని జెట్టూరు వద్దర శవాలై తేలారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ బండలం మంతట్టిలో బుధవారం ఈ ఘటన వెలుగు చూసింది. గ్రామానికి చెందిన నాటికేరి బుగ్గప్ప (50), యాదమ్మ (45) భార్యభర్తలు. వీరికి మంతట్టి గ్రామ శివారులోని కాగ్నానది పరీవాహక ప్రాంతంలో పొలం ఉంది. 

ఆదివారం సాయంత్రం పొలంలో కూరగాయలు కోసుకుని చంద్రవంచలో విక్రయించి.. రాత్రి బంధువుల దగ్గర ఉండి మరుసటి రోజు వస్తామని కొడుకు వెంకటప్పకు చెప్పి వెళ్లారు. అయితే, వారు సోమవారం రాకపోవడంతో కొడుకు.. బంధువుల దగ్గర ఆరా తీయగా ఉదయమే మంతట్టికి వెళ్లారని తెలిపారు. ఈ నేపథ్యంలో సోమ, మంగళవారాల్లో వారికోసం వెతికినా ఆచూకీ దొరకలేదు.

Hyderabad rains: దంచికొడుతున్న వాన‌లు.. ఉప్పొంగిన మూసీన‌ది.. అప్ర‌మ‌త్త‌మైన అధికారులు

బుధవారం ఉదయం వెంకటప్పకు బంధువులు కర్ణాటకలోని జెట్టూరు కాగ్నా నదిలో కొట్టుకువచ్చిన రెండు మృతదేహాల ఫొటోలు పంపారు. అక్కడికి వెళ్లి చూడగా తన తల్లిదండ్రులేనని గుర్తుపట్టాడు. కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బుగ్గప్ప, యాదమ్మ దంపతులు ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్లేవారని, చివరకు మరణంలోనూ కలిసే ఉన్నారని గ్రామస్తులు కంటతడ పెట్టుకున్నారు. 

ఇదిలా ఉండగా, హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లు జలమయం అవుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా మునిగిపోతున్నాయి. భారీ వర్షాల వల్ల మంగళవారం, హిమాయత్ సాగర్ జలాశయం 4 గేట్లను 2 అడుగుల మేర ఎత్తారు. దీంతో నీటి ఉధృతి అధికంగా ఉండటంతో టీఎస్‌పీఏ నుంచి రాజేంద్ర నగర్‌కు వెళ్లే సర్వీస్‌ రోడ్డులో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అయితే మంగళవారం సాయంత్రం సుమారు 4:45 గంటల సమయంలో ఓ వ్యక్తి  బైక్‌పై కలీజ్ ఖాన్ దర్గా నుండి శంషాబాద్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించాడు.

హిమాయత్ సాగర్ సర్వీస్ రోడ్ వంతెనను బారికేడ్లు ఉన్నాయి. దీంతో వరద నీరు ప్రవహించే రోడ్డుపైకి ప్రవేశించి.. దాటొచ్చుఅనుకుని రోడ్డులోకి ప్రవేశించాడు. రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తుండగా వరద ఉధృతిని బండి బ్యాలెన్స్ తప్పి..  కొట్టుకుపోతున్నాడు. రాజేంద్రనగర్ ట్రాఫిక్ పొలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ బేగ్ నేతృత్వంలోని రికవరీ వ్యాన్ బృందం ఇది గమనించింది. 

దీంతో నీటిలో కొట్టుకుపోతున్న బాధితుడిని భయపడొద్దని చెప్పి.. మొదట తాడుతో అతడిని కొట్టుకుపోకుండా చేసి.. ఆ తరువాత ఇనుప సంకెళ్లతో బండిని బిగించమని సూచనలు చేసి.. అతడిని, బండిని వరదల నుంచి కాపాడారు. తమకు అప్పగించిన విధుల పట్ల అత్యంత చిత్తశుద్ధితో, శ్రద్ధతో విధులు నిర్వహించిన హెడ్ కానిస్టేబుల్ బేగ్ నేతృత్వంలోని రికవరీ వ్యాన్ బృందం కృషిని సైబరాబాద్ పోలీసు కమిషనర్స్టీఫెన్ రవీంద్ర, ఐపీస్, అభినందించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Drunk & Drive Test in Ramagundam: పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబులు| Asianet News Telugu
Hyderabad : జీరో మైలురాయి ఎక్కడుంది.. హైదరాబాద్ దూరాన్ని ఎక్కడినుండి కొలుస్తారో తెలుసా..?