
ఆసిఫాబాద్ : మనిషి చంద్రుడిపైకి చేరుకుంటున్న రోజులివి. టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతున్న కంప్యూటర్ యువమిది. ఇలాంటి ఆధునిక ప్రపంచంలోనూ ఆటవిక కాలంలోని పరిస్థితులతో కొన్ని గ్రామాలున్నాయంటే నమ్మగలరా..! ఆధునికం మాట అటుంచి కనీస సౌకర్యాలు కూడా లేని గ్రామాలు అనేకం. కనీసం ఆ ఊరికి వెళ్ళడానికి కూడా సరైన రోడ్లు లేని పరిస్థితులున్నాయి. చివరకు ప్రాణాలు కాపాడుకోవాలన్నా ప్రాణాలకు తెగించి సాహసాలు చేయాల్సిన దుర్భర పరిస్థితులు కొన్ని గ్రామాల్లో వున్నాయి. అలాంటి గ్రామమే తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని లక్మాపూర్.
కుమురం భీం జిల్లా కెరమెరి మండలంలోని లక్మాపూర్ మారుమూల గ్రామం. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఈ గ్రామానికి బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. ఇందుకు ఈ గ్రామ శివారులోని వాగే కారణం. వర్షాలు బాగా కురిసి వరద నీరు చేరిందంటే వాగు పొంగిపొర్లి లక్మాపూర్ ను చుట్టుముడుతుంది. దీంతో రాకపోకలు నిలిచిపోయి గ్రామస్తులు ఎక్కడికి వెళ్లలేని పరిస్థితి వుంటుంది.
అయితే తాజాగా భారీ వర్షాలు కురవడంతో లక్మాపూర్ వాగుకు వరద పోటెత్తింది. ఇదే సమయంలో గ్రామానికి చెందిన పవన్, కవిత దంపతుల ఏడాది కొడుకు తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. కొడుకుకు వైద్యం చేయించాలంటే వాగును దాటి కెరమెరి వెళ్లాలి. దీంతో వరదనీటితో వాగు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నా దంపతులు సాహసం చేసారు. బిడ్డ ప్రాణాలు కాపాడుకునేందుకు తమ ప్రాణాలను లెక్కచేయలేదు. పవన్ భుజాలపై కొడుకుని ఎత్తుకుని... మరో చేతితో భార్య కవితను పట్టుకుని వాగు దాటాడు. వీరిని అదే గ్రామానికి చెందిన దగ్గరి బంధువు ఒకరు సహాయం చేసారు.
Read More వరద ప్రాంతాల్లో ముందస్తు చర్యల్లో ప్రభుత్వం విఫలం.. గవర్నర్‌కు కాంగ్రెస్ నేతల వినతిపత్రం
సాహసం చేసి వాగును దాటిన దంపతులు తమ బిడ్డకు వైద్యం చేయించుకున్నారు. తిరిగి అదే వాగులో మరోసారి సాహనం చేసి గ్రామానికి చేరుకున్నారు. ఇలా కొడుకుకు వైద్యం చేయించేందుకు తల్లిదండ్రులు నానా తంటాలు పడ్డారు. ప్రభుత్వం తమ బాధను చూసయినా లక్మాపూర్ వాగుపై వంతెన నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.