కరోనా వైరస్ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కఠిన నిర్ణయాలు తీసుకునే దిశగా ఆలోచన చేస్తున్నారు. లాక్ డౌన్ నియమాలను పాటించకపోతే 24 గంటల్లో కర్ఫ్యూ విధిస్తామని కేసీఆర్ హెచ్చరించారు.
హైదరాబాద్: లాక్ డౌన్ నియమాలు పాటించకపోతే తీవ్రమైన చర్యలుంటాయని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రజలను హెచ్చరించారు. రాష్ట్రాన్ని రక్షించుకోవడానికి ఎంత కఠినమైన నిర్ణయమైనా తీసుకుంటామని ఆయన చెప్పారు. కరోనావైరస్ పై ఆయన మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు.
ప్రజలు మాట వినకపోతే 24 గంటల్లో కర్ఫ్యూ విధిస్తామని ఆయన హెచ్చరించారు. అలా కూడా దారిలోకి రాకపోతే సైన్యాన్ని దించి, షూట్ ఎట్ సైట్ (కనిపిస్తే కాల్చివేత) ఆదేశాలు ఇస్తామని ఆయన చెప్పారు. హోం క్వారంటైన్ లో ఉన్నవాళ్లు తమ తమ పాస్ పోర్టులను కలెక్టర్ కార్యాలయాల్లో ఉంచాలని ఆదేశించారు. సమాజానికి ఇబ్బంది కలిగిస్తే అన్ని లైసెన్సులు రద్దు చేస్తామని ఆయన చెప్పారు. ప్రజాస్వామ్యం కాబట్టి సున్నితంగా చెబుతున్నామని ఆయన ఆయన చెప్పారు.
undefined
కొత్త కేసు రాకపోతే బాగుంటుందని కేసీఆర్ అన్నారు. తెలంగాణలో 36 మందికి కరోనా పాటిజివ్ ఉందని చెప్పారు. కరోనా వచ్చినవారంతా కోలుకుంటున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 7వ తేదీ వరు డిశ్చార్జి అవుతారని ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
పాస్ పోర్టులు సీజ్ చేయాలని చెప్పినట్లు ఆయన తెలిపారు. అనుమానితుల సంఖ్య 114 ఉందని, ఇది పెద్ద మహమ్మారి అని, ప్రపంచాన్ని గడగడలాడిస్తోందని ఆయన చెప్పారు. 119 మందిపై నిఘా వేసినట్లు ఆయన తెలిపారు. ఇది ప్రత్యేక పరిస్థితి అని, మనమంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు. మంచి పద్ధతిలో చెప్పి సముదాయిస్తున్నామని, వంద శాతం ప్రజలు సహకరించాలని ఆయన అన్నారు.
అమెరికాలో స్థానిక పోలీసులు నియంత్రించలేకపోవడంతో ఆర్మీని దించారని ఆయన అన్నారు. ప్రజలు సహకరించకపోతే 24 గంటలు కర్ఫ్యూ పెట్టాల్సి వస్తుందని, కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుందని, ఆర్మీని దించాల్సి వస్తుందని ఆయన అన్నారు. ఆ పరిస్థితి మనమెందుకు తెచ్చుకోవాలని ఆయన అడిగారు.
ప్రజా ప్రతినిధులు ఎటు వెళ్లారని ఆయన ప్రశ్నించారు. జీహెచ్ఎంసిలో 150 మంది కార్పోరేటర్లు ఉన్నారని, వారు ఎటు వెళ్లారని ఆయన అన్నారు. కార్పోరేటర్లందరూ రంగంలోకి దిగాలని, స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకోవాలని ఆయన అన్నారు నిర్మల్ క్వారంటైన్ లో ఉన్న వ్యక్తి మూడుసార్లు తప్పించుకున్నాడని ఆయన చెప్పారు.
మంత్రులంతా జిల్లా కేంద్రాల్లో ఉండాలని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నియోజకవర్గాలకు వెళ్లాలని, వీరు లీడ్ రోల్ తీసుకోవాలని ఆయన అన్నారు. పోలీసులదే బాధ్యత అంటే కాదని ఆయన అన్నారు. స్టాండింగ్ కమిటీలున్నాయని ఆయన చెప్పారు. వాటిని క్రియాశీలం చేయాలని ఆయన సర్పంచ్ లకు సూచించారు.
3400 వాహనాలు రాష్ట్ర సరిహద్దుల్లో వాహనాలు నిలిచి ఉన్నాయని, ఈ ఒక్క రోజు టోల్ ఎత్తేస్తున్నామని, ఈ రోజు పూర్తిగా ఎక్కడికక్కడికి చేరుకోవాలని ఆయన అన్నారు. మరణాలు, అత్యవసర ఆరోగ్య, ఇతర అత్యవసర విషయాల్లో డయల్ 100కు ఫోన్ చేస్తే స్పందిస్తారని, అవసరమైతే వాహన సదుపాయం కూడా ఏర్పాటు చేస్తారని ఆయన అన్నారు.
వరిపంటను, మొక్క జొన్న పంటను ప్రభుత్వం కొంటుందని, మార్కెట్ కమిటీలకు రావద్దని, వారి ఖాతాల్లో డబ్బులు వేస్తామని, గ్రామాలకే అధికారులు వస్తారని ఆయన చెప్పారు.
వీధుల్లోకి వేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని, సాయంత్రం 7 నుంచి మర్నాడు 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని ఆయన చెప్పారు. దుకాణాలన్నీ సాయంత్రం 6 గంటలకు మూసేయాలని ఆయన చెప్పారు. 6 గంటల తర్వాత ఒక నిమిషం తెరిచి ఉంచినా లైసెన్స్ రద్దు చేస్తామని ఆయన చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయపనులను అనుమతిస్తున్నట్లు తెలిపారు.
గుంపులుగా కాకుండా విడివిడిగా ఉండి పనిచేసుకోవాలని సూచించారు. దూరం పాటిస్తూ ఉపాధి హామీ పథకం పనులు చేసుకోవచ్చునని ఆయన చెప్పారు. గ్రామాలు కంచెలు వేసుకోవడాన్ని ఆయన అభినందించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల ప్రజలు నియంత్రణ పాటించాలని ఆయన సూచించారు.
మీడియా పట్ల పోలీసుల ప్రవర్తనపై డీజీపీకి చెప్పినట్లు ఆయన తెలిపారు. మీడియాకు ఇబ్బందులు కలిగించవద్దని ఆయన పోలీసులకు సూచించారు. ఇంతకు ముందు ఏవైనా సంఘటనలు చోటు చేసుకుంటే పెద్దవిగా చేయవద్దని ఆయన మీడియాను కోరారు.
తెలంగాణలో మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. వీరు ముగ్గురు కూడా విదేశాల నుంచి వచ్చారు. ఈ మేరకు తెలంగాణ ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. ఈ ముగ్గురు లండన్, జర్మనీ, సౌదీల నుంచి వచ్చారు. లండన్ నుంచి వచ్చిన హైదరాబాదు వచ్చిన 49 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. ఇతను హైదరాబాదులోని కోకాపేటకు చెందినవాడు.
జర్మనీ నుంచి వచ్చిన 39 ఏళ్ల వయస్సు గల మహిళకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. సౌదీ నుంచి వచ్ిచన 61 ఏళ్ల వయస్సు గల మహిళకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. వీరిని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరో 9 కరోనా ఆనుమానిత కేసులను కూడా అధికారులు గుర్తించారు. సోమవారంనాడు 33 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. తాజాగా మూడు కేసులు నిర్ధారణ కావడంతో ఆ సంఖ్య 36కు చేరింది