తెలంగాణలో కొత్తగా 14 కేసులు, ఇద్దరు మృతి: 872కి చేరిన బాధితుల సంఖ్య

By Siva Kodati  |  First Published Apr 20, 2020, 9:06 PM IST

తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. తాజాగా సోమవారం కొత్తగా మరో 14 కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 872కి చేరింది. ఇవాళ ఇద్దరు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 23కి చేరింది.


తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. తాజాగా సోమవారం కొత్తగా మరో 14 కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 872కి చేరింది. ఇవాళ ఇద్దరు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 23కి చేరింది.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో 12 కేసులు నమోదు కాగా... మేడ్చల్, నిజామాబాద్ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి. సోమవారం 186 మంది కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవ్వడంతో మొత్తం 663 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా రాష్ట్రంలో పెరుగుతున్న కేసుల దృష్ట్యా మే 7 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. 

Latest Videos

undefined

రాష్ట్రంలో 3.04 లక్షల పీపీఈ కిట్స్ అందుబాటులో ఉన్నాయని, అలాగే 3.53 లక్షల ఎన్ 95 మాస్కులు ఉన్నాయని సీఎం చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయని.. దేశంలో 8 రోజులకు ఒకసారి కేసుల సంఖ్య రెట్టింపు అవుతోందని తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉండకపోతే ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని కేసీఆర్ హితవు పలికారు. 

Also Read:మే 7 వరకు తెలంగాణలో లాక్‌డౌన్.. సడలింపులు ఉండవు: కేసీఆర్ ప్రకటన

కరోనా కేసుల విషయంలో మే 1 తర్వాత ఊరట కలిగే అవకాశం ఉందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. మే 7 వరకు గతంలో ఉన్న నిబంధనలే అమల్లో ఉంటాయని కేసీఆర్ స్పష్టం చేశారు. నిత్యావసరాలు ఎప్పటిలానే అందుబాటులో ఉంటాయన్నారు.

పలు టీవీ ఛానెళ్లు నిర్వహించిన సర్వేలో లాక్‌డౌన్ పొడిగించాల్సిందిగా 92 శాతం మంది అభిప్రాయపడ్డారని కేసీఆర్ గుర్తుచేశారు. మే 5న మరోసారి రాష్ట్ర కేబినెట్ సమావేశమవుతుందని అప్పుడున్న పరిస్ధితులపై చర్చిస్తుందని సీఎం తెలిపారు.

కంటైన్మెంట్ ఏరియాల్లోని ప్రజలు బయటకు రావొద్దని కేసీఆర్ కోరారు. స్విగ్గీ, జొమాటో సేవలకు తెలంగాణలో అనుమతి లేదన్నారు. ఏ ప్రాంతాల నుంచైనా మే 7 వరకు తెలంగాణకు రావొద్దని.. ఎలాంటి రవాణా సదుపాయాలు ఉండవని సూచించారు. పండుగలు, ప్రార్థనలు ఎట్టి పరిస్ధితుల్లోనూ ఇళ్లలోనే  చేసుకోవాలని అన్ని మతాల వారీకీ కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. 

కంటైన్మెంట్ ఏరియాల్లో డీజీపీ పర్యటించి పరిస్థితిని ప్రజలకు తెలియజేశారని ముఖ్యమంత్రి తెలిపారు. 15 రోజుల పాటు బయట దొరికే ఆహారాన్ని తినవద్దని కేసీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Also Read:లాక్‌డౌన్ ఎఫెక్ట్: మద్యం లేక కల్లుకు డిమాండ్... తాటి వనాల్లో రష్

ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోతలు కొనసాగుతాయని, పోలీసులకు పదిశాతం అదనపు వేతన ప్రోత్సాహకాలు ఉంటాయని సీఎం ప్రకటించారు. అలాగే విద్యుత్ ఉద్యోగులకు పూర్తి వేతనం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించినట్లు సీఎం తెలిపారు.

3 నెలల పాటు ఇంటి అద్దెలు వసూలు చేయకూడదని.. ఇంటి ఓనర్లు ఇబ్బంది పెడితే 100కు డయల్ చేయాలని కేసీఆర్ కోరారు. విపత్కర పరిస్ధితుల్లో 3 నెలల పాటు ఓనర్లు ఇంటి అద్దెల వసూలు వాయిదా వేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ మూడు నెలలు అద్దెను వడ్డీ లేకుండా తర్వాత వాయిదాల వారీగా చెల్లించవచ్చని సీఎం తెలిపారు. 

click me!