తెలంగాణలో 16కు పెరిగిన కరోనా కేసులు: సెర్చ్ ఆపరేషన్

By telugu teamFirst Published Mar 20, 2020, 11:26 AM IST
Highlights

తెలంగాణలో కరోనా వైరస్ సోకినవారి సంఖ్య 16కు చేరుకుంది. రాష్ట్ర విపత్తు నిధి నుంచి ప్రభుత్వం కరోనావైరస్ కట్టడికి నిధులను విడుదల చేసింది. కరీంనగర్ లో కర్ఫ్యూ వాతావరణం చోటు చేసుకుంది.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు 16కు పెరిగాయి. విదేశాల నుంచి వచ్చి సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుగుతున్నవారి కోసం ప్రత్యేక బృందాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. కజికిస్తాన్, దుబాయ్, ఇండోనేషియాల నుంచి వచ్చినవారిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. 

తెలంగాణలో 104 కాల్ సెంటర్ కు రద్దీ విపరీతంగా పెరిగింది. ప్రభుత్వం కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర విపత్తు నిధి నుంచి నిధులను విడుదల చేసింది. ప్రభుత్వం కరోనా కట్టడికి 116.28 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ల్యాబ్స్, ప్రత్యేక పరికరాల కోసం 33 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. క్వారంటైన్, స్క్రీనింగ్ కోసం 83.25 కోట్ల రూపాయలు విడుదల చేసింది.

Also Read: కరోనాతో మరొకరు మృతి: ఇండియాలో ఐదో మరణం

సికింద్రాబాదులోని మల్లేపల్లికి చెందిన కొంత మందిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కరీంనగర్ లో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. కరీంనగర్ లో ఇంటింటికీ వెళ్లి పరీక్షలు నిర్వహిస్తున్నారు. 

ఇదిలావుంటే, నల్లగొండలోని జైల్ ఖానా సమీపంలో గల ఓ ప్రార్థనా మందిరంలో వియత్నాం నుంచి వచ్చిన బృందం విడిది చేసింది. ముందు జాగ్రత్త చర్యగా 12 మంది పెద్దలను, ఇద్దరు చిన్నారులను పోలీసులు, రెవెన్యూ అధికారులు, వైద్యాధికారులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. కరోనా లక్షణాలు లేనప్పటికీ విదేశీయులు కావడంతో ముందు జాగ్రత్తగా ఆ పనిచేసినట్లు ఎస్పీ ఏవీ రంగనాథ్ చెప్పారు.

Also Read: ఏపీలో మూడు కరోనా వైరస్ కేసుల నమోదు, ప్రభుత్వం అప్రమత్తం

కరోనా వైరస్ వ్యాధి విస్తరణ నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా మంథనిలో అధికారులతో ఎమ్మెల్యే శ్రీధర్ బాబు రివ్యూ సమావేశం ఏర్పాటు చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.

గురువారంవరకు తెలంగాణలో 14 కేసులు నమోదయ్యాయి. వేరే రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చినవారిని గుర్తించడం కష్టంగా ఉందని ముఖ్యమంత్రి కెసీఆర్ గురువారంనాడు చెప్పారు. 

click me!