వైరస్ ను ఎక్కడ వ్యాప్తి చేస్తాడోనన్న భయంలో హోంక్వారంటైన్ లో వున్న కరోనా రోగిని ఇరుగుపొరుగు వారు సూటిపోటి మాటలతో వేధింపులకు గురిచేయడంతో ఆత్మహత్య చేసుకున్నాడు.
వికారాబాద్: కరోనా సోకిన వ్యక్తి మానసిక స్థైర్యం కోల్పోకుండా ధైర్యం చెప్పాల్సింది పోయి వేధింపులకు గురిచేశారు. వైరస్ ను ఎక్కడ వ్యాప్తి చేస్తాడోనన్న భయంలో ఇరుగుపొరుగు వారు అతడిని అంటరానివాడిగా చూస్తూ సూటిపోటీ మాటలతో వేధింపులకు గురిచేశారు. దీంతో తీవ్రమనస్థాపానికి గురయిన సదరు కరోనా రోగి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో హన్మంత్(31), ఈశ్వరి దంపతులు ఇద్దరు పిల్లలతో కలిసి నివాసముండేవారు. చెరుకు బండి నడిపిస్తూ హన్మంతు కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఉన్నంతలో ఆనందంగా సాగుతున్న వీరి జీవితంలో కరోనా మహమ్మారిలా ప్రవేశించింది. కరోనా లక్షణాలతో బాధపడుతున్న హన్మంతు ఈనెల 11వ తేధీన టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో అతడు హోంక్వారంటైన్ లోకి వెళ్లిపోయాడు.
అయితే కరోనా సెకండ్ వేవ్ తో బెంబేలెత్తిస్తున్న సమయంలో హన్మంతు కరోనా బారిన పడటంతో కాలనీవాసులు ఆందోళనకు గురయ్యారు. ఈ వైరస్ ను ఎక్కడ తమకు అంటిస్తాడోనని భయపడుతూ సూటిపోటీ మాటలతో అతడికి, కుటుంబాన్ని వేధించారు. అనారోగ్యంతో బాధపడుతున్న తనకు ధైర్యం చెప్పాల్సింది పోయి ఇలా వేధింపులకు గురిచేయడాన్ని తట్టుకోలేకపోయిన హన్మంతు దారుణ నిర్ణయం తీసుకున్నాడు.
read more తెలంగాణలో రేపు వ్యాక్సినేషన్‌కు సెలవు.. టీకాల కొరత వల్లేనా..?
శుక్రవారం అర్ధరాత్రి హన్మంత్ ఇంట్లోంచి బయటకు వెళ్లిన హన్మంతు నేరుగా తాండూరు- కొడంగల్ రోడ్డు మార్గంలోని రైల్వే బ్రిడ్జి వద్దకు వెళ్లాడు. రైలు వస్తుండగా సరిగ్గా దానికి ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడిని రైలు ఢీకొని దాదాపు 200 మీటర్ల వరకు లాకెళ్లడంతో మృతదేహం పూర్తిగా ఛిద్రమైంది.
ఈ ఘటనపై రైల్వే పోలీసులు సమాచారం అందుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యులు, బంధువులు అతడి అంత్యక్రియలు జరపడానికి ముందుకు రాకపోవడంతో తాండూరు యువజన సంఘం సభ్యులు మానవత్వంతో ముందుకువచ్చి అంత్యక్రియలు చేశారు.