వైఎస్ షర్మిలకు షాక్: ఖమ్మం బహిరంగ సభపై పోలీసుల నోటీస్

By telugu teamFirst Published Apr 5, 2021, 3:51 PM IST
Highlights

వైఎస్ కూతురు వైఎస్ షర్మిల ఈ నెల 9వ తేదీన ఖమ్మంలో తలపెట్టిన బహిరంగ సభకు కరోనా వైరస్ ఆటంకం కలిగించే అవకాశం ఉంది. వైఎస్ షర్మిల అనుచరుడికి పోలీసులు నోటీసులు ఇచ్చారు.

హైదరాబాద్: దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు వైఎస్ షర్మిల ఖమ్మం బహిరంగ సభపై కరోనా వ్యాధి ఆటంకాలు సృష్టించే అవకాశం ఉంది. తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీని స్థాపించాలని తలపెట్టిన షర్మిల ఈ నెల 9వ తేదీన భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే, ఈ సభకు పోలీసులు అనుమతి నిరాకరిస్తారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

రాష్ట్రంలో కరోనా కేసులో పెరుగుతున్న నేపథ్యంలో డిజాస్టర్ మేనేజ్ మెంట్ చట్టం ప్రకారం పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఖమ్మం జిల్లా షర్మిల అనుచరుడు లక్కినేని సుధీర్ కు ఖమ్మం పోలీసులు నోటీసులు జారీ చేశారు.  

తెలంగాణలో రాజకీయ పార్టీని స్థాపించి ముందుకు సాగాలని షర్మిల నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. గతంలో తలపెట్టిన సభకు ఎమ్మెల్సీ ఎన్నికలు అడ్డు రావడంతో అంతరాయం ఏర్పడింది. దాన్ని ఏప్రిల్ 9వ తేదీకి వాయిదా వేసుకున్నారు. ఈ సభకు ఇంతకు పోలీసులు అనుమతి కూడా ఇచ్చారు.

రాష్ట్రంలో కోరనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు నోటీసులు జారీ చేయడం వల్ల సభ జరుగుతుందా, లేదా అనుమానాలు తలెత్తుతున్నాయి.

కాగా, జనసేన అధినేత, సినీ హీరో పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తొలుత పోలీసులు అనుమతి నిరాకరించారు. ఆ తర్వాత దానికి అనుమతి ఇచ్చారు. వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం హైదరాబాదులో జరిగింది.

click me!