తెలంగాణలో లాక్‌డౌన్: నకిలీ జీవో సర్క్యులేట్ చేసిన వ్యక్తి అరెస్ట్

By narsimha lodeFirst Published Apr 5, 2021, 2:43 PM IST
Highlights

తెలంగాణలో మరోసారి లాక్‌డౌన్ అంటూ నకిలీ జీవోలను తయారు చేసి వాట్సాప్ తో పాటు సోషల్ మీడియాలో షేర్ చేసిన నిందితుడిని పోలీసులు సోమవారం నాడు అరెస్ట్ చేశారు.
 

హైదరాబాద్: తెలంగాణలో మరోసారి లాక్‌డౌన్ అంటూ నకిలీ జీవోలను తయారు చేసి వాట్సాప్ తో పాటు సోషల్ మీడియాలో షేర్ చేసిన నిందితుడిని పోలీసులు సోమవారం నాడు అరెస్ట్ చేశారు.సోమవారం నాడు తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్ ఈ ఘటన గురించి వివరించారు.

నాలుగు రోజుల క్రితం శ్రీపతి సంజీవ్ కుమార్ అనే వ్యక్తి తెలంగాణలో మళ్లీ లాక్ డౌన్ అంటూ నకిలీ జీవోను సృష్టించారని హైద్రాబాద్ సీపీ తెలిపారు. కరోనా మళ్లీ విజృంభిస్తున్న తరుణంలో రాత్రి వేళల్లో లాక్‌డౌన్ విధిస్తారంటూ నకిలీ జీవోను తయారు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారని ఆయన చెప్పారు.

గతంలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను డౌన్ లోడ్ చేసుకొని  పాత జీవోలోని తేదీలను మార్చి కొత్త జీవోగా సృష్టించి సోషల్ మీడియాలో పోస్టు చేశారని సీపీ తెలిపారు.సంజీవ్ తో పాటు అతని స్నేహితులు ఈ జీవోను వాట్పాప్ గ్రూప్‌ల్లో విస్తృతంగా షేర్ చేసినట్టుగా గుర్తించామన్నారు సీపీ.

ఈ తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని సీపీ ప్రజలను కోరారు. మరో వైపు వాస్తవాలు తెలుసుకోకుండా వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లు  ఈ తరహా ప్రచారాన్ని షేర్ చేస్తే కేసులు నమోదు చేస్తామని సీపీ అంజనీకుమార్ హెచ్చరించారు.నిందితుడు శ్రీపతి సంజీవ్ కుమార్ ది నెల్లూరు జిల్లాగా చెప్పారు. ఆయన ఓ కంపెనీలో చార్టెడ్ అకౌంటెంట్ గా పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. 

click me!