Hyderabad: జీహెచ్ఎంసీ వెలుపల డంపింగ్ యార్డుల కోసం భూములను గుర్తించాలని ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ (ఎంఏ అండ్ యూడీ) మంత్రి కే.తారక రామారావు (కేటీఆర్) అధికారులను ఆదేశించారు. అలాగే, మూసీ నదిపై 14 వంతెనలు నిర్మించనున్నట్లు తెలిపారు.
Telangana MA&UD Minister KTR: రాష్ట్ర అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే.తారక రామారావు (కేటీఆర్) అన్నారు. జీహెచ్ఎంసీ వెలుపల డంపింగ్ యార్డుల కోసం భూములను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. అలాగే, మూసీ నదిపై 14 వంతెనలు నిర్మించనున్నట్లు తెలిపారు.
వివరాల్లోకెళ్తే.. జీహెచ్ ఎంసీ పరిధిలో కొత్త డంపింగ్ యార్డులకు స్థలాలుగా ఉపయోగించేందుకు అనువైన ఖాళీ స్థలాలను గుర్తించాలని రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల కలెక్టర్లను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కార్యాలయంలో జరిగిన 64వ సిటీ కన్వర్జెన్స్ సమావేశానికి అధ్యక్షత వహించిన కేటీఆర్ మాట్లాడుతూ కొత్త డంప్ యార్డు స్థలాలు రాబోయే 50 సంవత్సరాల వరకు నగర అవసరాలను తీర్చాలనీ, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జనావాస ప్రాంతాలకు దూరంగా ఉండాలని అన్నారు.
డంపింగ్ యార్డుల కోసం ఆచరణాత్మక, సమర్థవంతమైన ప్రణాళిక, భూ వినియోగాన్ని ఆప్టిమైజ్ చేయాల్సిన అవసరాన్ని వ్యక్తం చేసిన కేటీఆర్ ఖానాపూర్, దుండిగల్ లో ప్రతిపాదిత యార్డులపై వారం రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. జవహర్‌నగర్ డంపింగ్ యార్డు రోజుకు 8 వేల టన్నులు దాటిందనీ, సురక్షిత ప్రత్యామ్నాయ డంప్ సైట్లను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు.
మూసీ నదిపై 14 వంతెనల నిర్మాణం..
మూసీ నదిని, దాని పరిసరాలను మార్చే ప్రణాళికల గురించి వివరిస్తూ, నదిపై 14 వంతెనలు, ఒక ఎక్స్ ప్రెస్ వే నిర్మాణంపై చర్చించినట్టు అధికారులు తెలిపారు. కొండపోచమ్మ సాగర్ నుంచి ఉస్మాన్ సాగర్ వరకు మూసీ నదిలోకి నీరు చేరుతుందనీ, 14 వంతెనలకు టెండర్లు పిలవాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు. నగర కేంద్రం నుంచి ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)ను ఒకవైపు నుంచి మరో వైపుకు కలుపుతూ నాలుగు, ఆరు లేన్ల ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వివరించారు.
డ్రగ్స్ ఘటనలపై స్పందిస్తూ.. గంజాయి విక్రయాలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని, పబ్ లు, హుక్కా పార్లర్లు, పాఠశాలలు, ఫాంహౌస్ ల వద్ద నిఘా పెంచాలని సూచించారు. అంతేకాకుండా నగరం చుట్టూ మల్టీలెవల్ పార్కింగ్ స్థలాలకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నాన్ మోటరైజ్డ్ రవాణాను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలనీ, నగరంలో అవసరమైన చోట స్కైవాక్ లు నిర్మించాలని మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించారు.