తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ ఝలక్

First Published Mar 23, 2018, 1:28 PM IST
Highlights
  • ఏడుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేల ఓట్లు చెల్లని ఓట్లుగా ప్రకటించాలి
  • వారి ఓట్లు ఎవరికి వేశారో వారిని రాజ్యసభ సభ్యుడిగా డిస్ క్వాలిఫై చేయాలి

తెలంగాణలో ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి అధికార టిఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. బంగారు తెలంగాణ సాధించే ఉద్దేశంతోనే తాము అధికార పార్టీలో చేరినట్లు వారు ప్రకటించారు. టిఆర్ఎస్ లో జాయినింగ్ సమయంలోనే వారు ఈ రకమైన ప్రకటనలు చేశారు. అయితే వారి సభ్యత్వాలను రద్దు చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ ఎప్పటినుంచో పోరాటం చేస్తున్నది. స్పీకర్ కు ఫిర్యాదు చేసింది.

పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ గుర్తు మీద గెలిచి టిఆర్ఎస్ లో చేరిన ఈ ఏడుగురి సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని కోరింది. న్యాయస్థానాల్లోనూ పోరాటం కొనసాగిస్తోంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదుపై స్పీకర్ ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. తమకు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఫిర్యాదు అందిందని.. దాన్ని పరిశీలిస్తున్నామని స్పీకర్ పలు సందర్భాల్లో ప్రకటించారు.

అయతే రాజ్యసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కొత్త స్కెచ్ వేసింది. పార్టీ ఫిరాయించిన ఏడుగురు ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేయాలని ఎప్పటి నుంచో కోరుతున్న ఆ పార్టీ తాజాగా ఫిరాయింపు ఎమ్మెల్యేల ఓటును చెల్లని ఓటుగా పరిగణించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక ఫిర్యాదు చేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు విప్ ధిక్కరించారని, అందుకే వారి ఓట్లను పరిగణలోకి తీసుకోరాదని డిమాండ్ చేసింది.

అంతేకాకుండా ఈ ఏడుగురి ఓట్లు ఎవరికి పడ్డాయో వారిని రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కాకుండా డిస్ క్వాలిఫై చేయాలని డిమాండ్ చేసింది. రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ఏజెంట్ గా ఉన్న టిపిసిసి ప్రధాన కార్యదర్శి రేగ కాంతారావు ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖను రాశారు. ఇవాళ ఎన్నికల పోలింగ్ లో రేగ కాంతాారావుతోపాటు ములుగు సీతక్క, డాక్టర్ మల్లు రవి పోలింగ్ ఏజెంట్లుగా పనిచేశారు.

మరి ఈ విషయంలో కాంగ్రెస్ వాదనను కేంద్ర ఎన్నికల సంఘం పరిగణలోకి తీసుకుంటుందా? లేదా అన్నది తేలాల్సి ఉంది.

కాంగ్రెస్ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలు వీరే..

1 పువ్వాడ అజయ్ కుమార్, ఖమ్మం

2 కాలే యాదయ్య, చేవెళ్ల

3 చిట్టెం రామ్మోహన్ రెడ్డి, మఖ్తల్

4 డి.ఎస్. రెడ్యానాయక్, డోర్నకల్

5 కోరం కనకయ్య, ఇల్లందు

6 విఠల్ రెడ్డి, ముథోల్

7 ఎన్. భాస్కర్ రావు, మిర్యాలగూడ

click me!