
Suryapet: సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. క్వింటాల్ ధాన్యాన్ని కేవలం రూ.1200 నుంచి రూ.1400 ఇస్తుండడంపై రైతులు ఆగ్రహించారు. ఈ క్రమంలో రైతులు కాంటా మిషన్లు ధ్వంసం చేశారు. వరి డంపులకు నిప్పంటించి, మార్కెట్ యార్డు కార్యాలయాన్ని లాక్ చేశారు. నిన్నటి (శుక్రవారం) క్వింటాల్ ధాన్యం ధర రూ.1800 ఉండగా.. ఒక్క రోజులోనే.. వరి ధర క్వింటాల్‌కు రూ.1200కి పడిపోవడంతో రైతులు వరి కొనుగోలును నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ మార్కెట్ యార్డులో ఆందోళనకు దిగారు. సన్న రకాల ధాన్యాన్ని కూడా క్వింటాలుకు రూ.1200 నుండి 1400 మధ్య కొనుగోలు చేయడంతో రైతులు భగ్గుమన్నారు.
ఇదే ఖరీఫ్ కాలంలో క్వింటాల్‌కు ధాన్యానికి మద్దతు ధరగా రూ.1960 లకు వరి కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసేవారు. యాసంగి పంట సీజన్‌కు వరి కొనుగోళ్లు నిలిచిపోవడంతో వరిధాన్యం ధర రోజురోజుకూ భారీగా పడిపోతుంది. ఒక్కరోజులోనే క్వింటాల్‌కు రూ.600 ధర పతనం కావడం రైతుల్లో విషాదాన్ని నింపింది. ఉన్నతాధికారులు మార్కెట్ యార్డుకు వచ్చేంత వరకు వరిధాన్యం కొనుగోలును నిలిపివేయాలని వ్యాపారులు కోరడంతో రైతులు తూకం యంత్రాలను ధ్వంసం చేశారు. వ్యాపారులు, అధికారులు కుమ్మక్కై పరిస్థితిని అనుకూలంగా మలుచుకుని వరిధాన్యం ధరను తగ్గించారని ఆరోపించారు. మద్దతు ధర పెంచిన తర్వాతే కొనుగోళ్లు చేపట్టాలని రైతులు ఆందోళన చేపట్టారు. రైతుల ఆందోళనతో కొనుగోళ్లు నిలిచిపోయాయి. కనీసం రూ.1700 నుంచి రూ.1800 చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు.
మరోవైపు మిల్లర్లు కొనుగోలు చేసేందుకు ముందుకు రాకపోవడంతో వరిధాన్యం ధర పతనమైందని వ్యాపారులు పేర్కొంటున్నారు. లక్ష క్వింటాళ్లకుపైగా వరి ధాన్యం నాడు మార్కెట్‌కు అమ్మకానికి తీసుకురావడం కూడా ఈ పరిస్థితికి కారణమైంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు జిల్లా కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి మార్కెట్ యార్డుకు చేరుకుని రైతులు, వ్యాపారులతో చర్చలు జరిపారు. అలాగే రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.