లోక్ సభ టికెట్ల కోసం దరఖాస్తుల స్వీకరణ ముగియడంతో ఇక అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలవుతున్నది. ఈ నేపథ్యంలోనే తమ బంధువులకు టికెట్ ఇవ్వాలని సీనియర్లు అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారు.
Congress Ticket: కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం నుంచి ఎంపీ సీట్లు కూడా గతంలో కంటే ఎక్కువ సాధించగలమనే ధీమాలో ఉన్నది. ఈ సారి 12 నుంచి 14 సీట్లు గెలుచుకోవాలని అనుకుంటున్నది. లోక్ సభ స్థానాల్లో అభ్యర్థుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది కూడా. జనవరి 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు ఆశావహులు దరఖాస్తులు చేసుకున్నారు. రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాల టికెట్ల కోసం మొత్తం 306 దరఖాస్తులు అందాయి.
దరఖాస్తుల ప్రక్రియ పూర్తి కావడంతో ఎంపిక ప్రక్రియకు కాంగ్రెస్ శ్రీకారం చుడుతున్నది. ఇందులో భాగంగా మంగళవారం పార్లమెంటరీ ఎలక్షన్ కమిటీ కీలక సమావేశం నిర్వహించనుంది. తెలంగాణ సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ భేటీ నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే సీనియర్లు సీట్ల కోసం ప్రయత్నాలు షురూ చేశారు. తమ వారసులకు, తమ బంధువులకు టికెట్లు ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారు. కొందరైతే దరఖాస్తు చేయకున్నా.. టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం.
undefined
కోమటిరెడ్డి బ్రదర్స్ ఎంపీ టికెట్ కోసం జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూతురు శ్రీనిధిని నల్గొండ నుంచి పార్లమెంటుకు పంపాలని అనుకుంటున్నారు. దరఖాస్తు చేయకున్నప్పటికీ టికెట్ ఇవ్వాలని అడుగుతున్నట్టు తెలిసింది. రాజగోపాల్ రెడ్డి కూడా భోనగిరి నుంచి తన భార్యను పోటీ చేయించాలని అనుకుంటున్నారు. ఇక ఇదే భోనగిరి టికెట్ కోసం రేవంత్ రెడ్డితో సాన్నిహిత్యమున్న చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఆశపడుతున్నారు.
Also Read: Maldives: భారత బలగాలు మే నెలలోపు వెళ్లిపోవాల్సిందే.. : మాల్దీవ్స్ అధ్యక్షుడు
సీనియర్ లీడర్ జానారెడ్డి కూడా తన కొడుకు రఘువీర్‌కు లేదంటే.. తనకైనా నల్గొండ టికెట్ ఇవ్వాలని కోరినట్టు సమాచారం. సూర్యపేట నుంచి అసెంబ్లీ టికెట్ పొందలేకపోయిన పటేల్ రమేశ్ రెడ్డి కూడా ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూతురు లేదా భార్యను ఎంపీ బరిలోకి దింపాలని యోచిస్తున్నట్టు తెలిసింది. వారు దరఖాస్తు చేయకున్నప్పటికీ మెదక్ నుంచి టికెట్ పొందాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇక చెన్నూమర్ ఎమ్మెల్యే వివేక్ కూడా తన కొడుకు కోసం ఎంపీ టికెట్ పొందడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు రాజకీయ వర్గాల సమాచారం.