హైద్రాబాద్ బోయినపల్లిలో కాంగ్రెస్ శిక్షణ తరగతులు: గైర్హాజరైన సీనియర్లు

By narsimha lode  |  First Published Jan 4, 2023, 2:12 PM IST

నగరంలోని బోయినపల్లిలో  తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శిక్షణ తరగతులు ఇవాళ ప్రారంభమయ్యాయి.  ఈ శిక్షణ తరగతులకు  సీనియర్లు  గైర్హాజరయ్యారు.పలు కారణాలతో  సీనియర్లు కొందరు  ఈ ట్రైనింగ్ సెషన్ కు దూరంగా  ఉన్నారు. 


హైదరాబాద్:  నగరంలోని బోయినపల్లిలో  తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శిక్షణ తరగతులు ఇవాళ ప్రారంభమయ్యాయి.ఈ శిక్షణ తరగతులకు  సీనియర్లు గైర్హాజరయ్యారు. ధరణి, హత్ సే హత్  జోడో , ఎన్నికల నిబంధనలపై  నేతలకు  శిక్షణ ఇవ్వనున్నారు.  ఈ కార్యక్రమానికి  హత్ సే హత్  జోడో  అభియాన్ తెలంగాణ ఇంచార్జీ  గిరీష్ జోడంకర్  హాజరయ్యారు. 

ఈ శిక్షణ తరగతులకు హాజరు కావాలని  కాంగ్రెస్ సీనియర్లకు  ఎఐసీసీ చీఫ్ మల్లికార్జుణ ఖర్గే సూచించారు.  టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి  నిన్న ఖర్గే ఫోన్ చేశారు.  శిక్షణ తరగతులకు హాజరు కావాలని సూచించారు. అయితే కొందరు సీనియర్లు ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు.  పార్టీ సమావేశాలతో పాటు  ఇతరత్రా కారణాలతో  సీనియర్లు  ఈ సమావేశానికి దూరంగా  ఉన్నారు. 

Latest Videos

డిఫెన్స్  పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో  పాల్గొనేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి  ఢిల్లీకి వెళ్లారు. దీంతో ఆయన ఈ సమావేశానికి దూరంగా  ఉన్నారు.  మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ  శ్రీశైలంలో  ఉండడంతో ఆయన  కూడా  ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు.  ఎఐసీసీ ఇచ్చిన  కార్యక్రమాల్లో భాగంగా మాజీ మంత్రి శ్రీధర్ బాబు మహరాష్ట్ర పర్యటనలో  ఉన్నారు. దీంతో  శిక్షణ తరగతులకు  దూరమయ్యారు.  ములుగు ఎమ్మెల్యే సీతక్క  భారత్ జోడో యాత్రలో  ఉన్నందున ఆమె కూడా ఈ శిక్షణ తరగతులకు  దూరంగా  ఉన్నారు.ఎఐసీసీ  కార్యక్రమంలో భాగంగా  వేరే రాష్ట్రంలో  ఉన్నందున  వి. హనుమంతరావు  కూడా ఈ  శిక్షణ తరగతులకు రాలేదు. 

ఈ సమావేశానికి ఎఐసీసీ సెక్రటరీ బోస్ రాజు ,సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ మంత్రులు కోదండ రెడ్డి , షబ్బీర్ అలీ  తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు .రాష్ట్ర కాంగ్రెస్ లో  చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో  దిగ్విజయ్ సింగ్  గత మాసంలో  రాష్ట్రంలో పర్యటించారు. కాంగ్రెస్ నేతలతో చర్చించారు.  ఏదైనా ఇబ్బందులుంటే  పార్టీ అంతర్గత వేదికల్లోనే చర్చించాలని  దిగ్విజయ్ సింగ్  సూచించారు.
 

click me!